భారత క్రికెటర్లు జట్టు కోసం ఆడరు.. ఇంజమామ్ సంచలన వ్యాఖ్యలు
By తోట వంశీ కుమార్ Published on 23 April 2020 12:42 PM ISTపాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ భారత క్రికెటర్లపై తన అక్కసును వెల్లగక్కాడు. భారత ఆటగాళ్లు టీమ్ కోసం కాకుండా వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ఇంజి.. మరో పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా యూ ట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
పేపర్ పై చూస్తే.. భారత ఆటగాళ్లు పులులుగా కనబడతారని.. పాక్‌బ్యాట్స్‌మెన్లు 30 నుంచి 40 పరుగులు మాత్రమే చేసిన అవి జట్టు గెలుపు కోసం ఉపయోగపడతాయన్నారు. ఇక భారత ఆటగాళ్లు సెంచరీలు చేసిన అవి వారి వ్యక్తిగత రికార్డులు పెంచుకోవడానికికే తప్ప జట్టులకు గెలుపు కోసం కాదన్నారు. ఇరు జట్లకు మధ్య ఉన్న ప్రధాన తేడా ఇదే నని ఇంజి పేర్కొన్నారు. రికార్డులు చూస్తే ఈ విషయం ఎవరికైనా తెలుస్తుందన్నారు.
1992లో పాకిస్థాన్‌కు ప్రపంచకప్ అందించిన అప్పటి కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పై ఇంజమామ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇమ్రాన్ టెక్నికల్ కెప్టెన్ కాదు. కానీ ఆటగాళ్ల నుంచి తనకు కావాల్సింది ఎలా రాబట్టుకోవాలో అతడికి తెలుసు. ఆటగాళ్ల ఒక సిరీస్‌లో విఫలమైనంత మాత్రాన వారిని వెంటనే పక్కన బెట్టేవాడు కాడు. ఆ ఆటగాళ్లపై పూర్తి విశ్వాసం ఉంచుతూ.. ఎక్కువ అవకాశాలు ఇచ్చేవాడు. ఇదే అతనిపై గౌరవం పెరిగేలా చేశాయని తెలిపాడు.
ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో భారత్, పాకిస్థాన్ జట్లు 199 తలపడగా.. పాక్ 86 మ్యాచుల్లో విజయం సాధించగా.. భారత్ 70 మ్యాచుల్లో గెలిచింది. భారత్, పాక్ జట్లు ప్రస్తుతం ఐసీసీ టోర్నీలలో తలపడడం తప్ప ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం లేదు.