బంగ్లాదేశ్ జైలు నుంచి 8 మంది ఏపీ మత్స్యకారులు విడుదల
By సుభాష్
గత ఏడాది అక్టోబర్ 2న భారత్ సరిహద్దును దాటి బంగ్లాదేశ్ పోలీసులకు చిక్కిన 8 మంది మత్స్యకారులు బుధవారం బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలయ్యారు. మత్స్యకారులంతా విజయనగరం జిల్లా తిప్పలవలసకు చెందిన వారు. వీరు జైలు నుంచి తిరిగి వస్తుండటంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. 2019, సెప్టెంబర్ 27న విశాఖ ఫిషింగ్ హర్బర్ నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లారు. అక్టోబర్ 2న సరిహద్దు దాటి బంగ్లాదేశ్ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ రోజు బంగ్లాదేశ్ జైలు నుంచి 8 మంది విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులు ఎట్టకేలకు విడుదలయ్యారు. వీరంతా బోటు ద్వారా విశాఖకు చేరుకునే అవకాశం ఉంది.
కాగా, జైలు నుంచి విడుదలైన 8 మంది మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రాష్ట్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లిపల్లి ఎల్లాజీ కోరారు. వీరంతా నాలుగు నెలలుగా బందీలుగా ఉన్న మత్య్సకారుల విడుదల కోసం ఏపీ మత్స్యకార యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వాసుపల్లి జానకి రామ్ చేసిన కృషి ఫలించిందన్నారు. బంగ్లాదేశ్ బాగర్ హాట్ కోర్టులో మత్స్యకారుల తరపున కేసు కూడా వేశారని పేర్కొన్నారు. ఇటీవల పాకిస్తాన్ జైలు నుంచి ఇదే విధంగా విడుదలైన 23 మంది మత్య్సకారులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున సీఎం జగన్ ఆర్థికసాయం అందించారని తెలిపారు. ఇప్పుడు బంగ్లాదేశ్ జైలు నుంచి వచ్చిన వీరిని కూడా సీఎం జగన్ అలాగే ఆదుకోవాలని కోరారు.