3000 కిమీ.. 500 లీటర్ల డీజిల్... తొమ్మిది ప్రాణాలు... ఒక్క పడవ...!!

By అంజి  Published on  30 Nov 2019 6:03 AM GMT
3000 కిమీ.. 500 లీటర్ల డీజిల్... తొమ్మిది ప్రాణాలు... ఒక్క పడవ...!!

నరకకూపంలో ఏడాది పాటు దుర్భర జీవనం.... కష్టాలే భోజనం. కన్నీళ్లే విందు. యమయాతనలే స్వర్గ సుఖాలు. యజమాని తిట్లే దీవెనలు....

ఆ తొమ్మిది మంది బతుకు అలాగే తెల్లవారిపోతుందనుకున్నారు. తమిళనాడు, కేరళలకు చెందిన తొమ్మిది మంది జాలర్లు మంచి బతుకు కోసం, కాసింత ఎక్కువ జీతం కోసం సొంత నేలను వదిలి సుదూర గల్ఫ్ దేశం యెమెన్ కు చేరుకున్నారు. సుల్తాన్ అనే య జమానికి వారికి అరచేతిలో స్వర్గం చూపించాడు. కానీ అక్కడకి వెళ్లిన తరువాత ఒప్పుకున్న జీతం ఇవ్వలేదు. సెలవుల్లేవు. నెలల తరబడి సముద్రంపై పడవలో వెళ్లమన్నాడు. రోజుకి ఒకే పూట భోజనం. బతుకును పంజరంగా మార్చేశాడు. చివరికి ఆ తొమ్మిది మంది ఎలాగోలా యజమాని పడవనే దొంగిలించి, అదే పడవలో గుప్పెడు కాసులు, పిడికెడ్ భోజనం తీసుకుని యెమెన్ తీరం నుంచి భారత్ కు వచ్చేందుకు దుస్సాహస యాత్ర ప్రారంభించారు.

మూడు వేల కిలో మీటర్ల దూరం అనంత సాగరపుటలల మీద ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వారు బయలుదేరారు. నవంబర్ 19 న వారు బయలు దేరి తమ సాహసోపేత విముక్తి యాత్రను ప్రారంభించారు. ఒక చిన్న పడవలో ఇంత దూరం ప్రయాణించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అనుక్షణం మృత్యువుతో సావాసమే. అను నిత్యం ప్రాణ గండమే. కానీ యెమెన్ లో బానిసత్వం కన్నా ఇదే మేలనిపించింది. నవంబర్ 19 న వారు తమ కుటుంబాలకు ఫోన్ చేసి తాము పారిపోయి వస్తున్నట్టు తెలిపారు. అప్పట్నించీ వారి కుటుంబాలకు కునుకు లేదు. ఎందుకంటే వారికి అలల ఎత్తు తెలుసు. సముద్రం లోతు తెలుసు. ప్రయాణంలో ప్రమాదాలు తెలుసు. ప్రయత్నం ప్రళయాంతకమనీ తెలుసు.

పడవలో 500 లీటర్ల డీజిల్, ఒక సగం బస్తాడు ఉల్లిగడ్డలు, కాసింత అదృష్టం, కరుణించిన కడలి తప్ప మరేమీ లేకపోయినా వాళ్లు బయలుదేరారు. దారంతా ప్రమాద భరితం, దిక్కూ తెన్నూ తెలియని దారిలో దిశా దశాలేని ప్రయాణం మొదలుపెట్టారు. వాళ్ల పడవ సముద్రాలు దాటే పడవ కాదు. కేవలం చేపలు పట్టే పడవ.

కొచ్చి రేవుకు జాలర్లు..

తరువాత నవంబర్ 26 న వారు లక్షదీవుల దగ్గర ఉన్న కాల్పెని అటోల్ వద్ద కు చేరుకున్నారు. అక్కడ నుంచి కొచ్చి 2018 కి. మీ దూరం. ఇటు జాలరుల కుటుంబాలు, మత్స్యకార సంఘాలు ప్రభుత్వానికి, కోస్ట్ గార్డుకు వారు పారిపోయి వస్తున్న వివరాలు తెలిపాయి. కోస్ట్ గార్డుల డోర్నియర్ విమానం వారి పడవను గుర్తించింది. ఆ తరువాత ఒక ప్రత్యేక పడవను పంపి వారిని రక్షించి కొచ్చి రేవుకు తీసుకువచ్చింది.

శుక్రవారం మధ్యాహ్నం 1.15 కి ఆ తొమ్మిది మంది జాలరులు కొచ్చి నేలను తాకారు. యెమెన్ నరకం నుంచి వచ్చి నేలను తాకే సరికి కళ్లలో కన్నీరు, గుండెలో ఉద్వేగం ఉప్పొంగాయి. ఒక్క సారి నేలను ముద్దాడారు. మూడు వేల కిలో మీటర్లు దాటి, పది రోజుల ప్రయాణం చేసి వచ్చిన తరువాత తల్లినేల స్పర్శ వాళ్లకు కొత్త జన్మనిచ్చింది, స్వేచ్ఛ, విముక్తి అనే రెండు తెడ్లు వారిని ఈ సాహసం చేయించాయి. ఒక సాహసోపేత సినిమాకు తగ్గని సాహస యాత్ర చేసి వచ్చారు వాళ్లు. యెమెన్ నరకంలో మగ్గే కంటే కొచ్చి లో కలో గంజో తాగితే చాలనుకుంటున్నారు వాళ్లు.

Next Story