విదేశాల్లో మన వీధి కుక్కల వైభవం

By అంజి  Published on  27 Jan 2020 10:14 AM GMT
విదేశాల్లో మన వీధి కుక్కల వైభవం

ముఖ్యాంశాలు

  • వీధి కుక్కల్ని చేరదీసి విదేశాలకు పంపుతున్న స్వచ్ఛంద సంస్థ
  • వైద్యం చేయించి ఆశ్రయం కల్పించి దత్తత ఇస్తున్న స్వచ్ఛంద సంస్థ
  • విదేశాల్లో భారతీయ వీధి కుక్కలకు విపరీతమైన డిమాండ్
  • విదేశాలకు వెళ్లాక స్వర్గ సుఖాలను అనుభవిస్తున్న వీధి కుక్కలు
  • ఇండియాలో దిక్కూమొక్కూలేని స్థితిలో దీనమైన జీవితం
  • రోడ్లమీద నానాయాతన పడుతున్నా పట్టించుకునేవాళ్లు లేరు
  • విదేశాల్లో మాత్రం వాటిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు
  • దాదాపు 200 కుక్కలు ఇలా విదేశాలకు దత్తత వెళ్లాయి
  • స్ట్రే డాగ్ సపోర్ట్ ఇన్ కార్పొరేషన్ ఫేస్ బుక్ గ్రూప్ స్వచ్ఛంద సేవలు

హైదరాబాద్ : కిట్టూ.. రెండేళ్ల కుక్క.. హైదరాబాద్ రోడ్లమీద దిక్కు లేకుండా తిరుగుతున్న ఈ కుక్కని ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి రక్షణ కల్పించింది.. హైదరాబాద్ లో ఈ కుక్కకు ఆ స్వచ్ఛంద సంస్థ ఆశ్రయం కల్పించేవరకూ దాన్ని పట్టించుకునేవాళ్లే లేరు. కానీ ఇప్పుడు దాని దశ తిరిగింది. మియామీలో ఉన్న తెల్ల బెంచ్ ల మీద ఇప్పుడు అది రాజసాన్ని వెలగబెడుతోంది..

నడిరోడ్డుమీద తీవ్రమైన గాయాలతో, మల్పిపుల్ ఫ్రాక్చర్స్ తో రక్తం మడుగులో పడి ఉన్న కిట్టూని ఉజ్వల్ చింతల అనే అమెరికన్ దత్తత తీసుకుని దాని సంరక్షణ బాధ్యతల్ని స్వీకరించేందుకు అంగీకరించారు. డిసెంబర్ 2019లో ఆయన ఓ పనిమీద ఇండియాకి వచ్చినప్పుడు హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. అందరిలా చూసి ఊరుకోలేక దాన్ని తీసుకెళ్లి సరైన ట్రీట్మెంట్ ఇప్పించి, ఆహారం ఇచ్చి, రక్షణ కల్పించిన ఎన్జీఓ కిట్టూ బాధ్యతలను ఆ అమెరికన్ కి అప్పగించింది.

కిట్టూకి సరైన వైద్యం చేయించిన తర్వాత మియామీలో నివసించే ఉజ్వల్ చింతల ఎన్జీఓ సాయంతోనే దాన్ని అమెరికాకి తీసుకెళ్లారు. స్వచ్ఛంద సంస్థ ఆ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి కిట్టూని ఆయన దగ్గరికి అమెరికాకు పంపించింది. కిట్టూలాగే ఇప్పుడు చాలా కుక్కలకు ఆ అదృష్టం పడుతోంది.

ఇలా రోడ్లమీద దిక్కూమొక్కూ లేకుండా పడిఉన్న కుక్కల్ని ఆ స్వచ్ఛంద సంస్థ చేరదీసి, వైద్యం చేయించి, రక్షణ కల్పించి కుక్కల్ని ప్రేమగా పెంచుకోవాలనుకునే విదేశీయులకు అప్పగిస్తోంది. అమెరికా, యూరోప్, కెనాడాలోని చాలామంది ఇలాంటి కుక్కలకు రక్షణను, ఆశ్రయాన్ని కల్పించేందుకు ముందుకొస్తున్నారు. ఈ స్వచ్ఛంద సంస్థను సంప్రదిస్తున్నారు.

భారతదేశంలో మాత్రం చాలామంది లాబ్రడార్లు, పమేరియెన్లు, హస్కీలు, జెర్మన్ షెఫర్డ్స్ ఇంకా బెర్నార్డ్ లాంటి పిడిగ్రీ బ్రీడ్స్ ని ఇష్టపడుతున్నారని ఆ స్వచ్ఛంద సంస్థ చెబుతోంది. కానీ అదే సమయంలో మనదేశంలో వీధి కుక్కలుగా అలనా పాలనా లేకుండా తిరుగుతున్న నాటు కుక్కల్ని పెంచుకునేందుకు వాటిని సంరక్షించేందుకు అమెరికాలాంటి సంపన్న దేశాల్లో చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారంటోందా సంస్థ.

ఫ్యామిలీ సంరక్షణలో హాయిగా పికాబో

కొద్ది రోజుల క్రితం కాళ్లు చచ్చుబడిపోయి, ముఖంమీద పెద్ద ట్యూమర్ తో అత్యంత దయనీయమైన స్థితిలో హైదరాబాద్ రోడ్లమీద కేవలం ప్రాణం మాత్రమే మిగిలి పడి ఉన్న మంకీ (ఇప్పుడు పేరు మారింది పికాబో), పావన్ అనే రెండు కుక్కలు ఇప్పుడు వాషింగ్ టన్ డి.సిలో కొత్త ఇంట్లో కొత్త మనుషుల అప్యాయతను, అనురాగాన్ని చవి చూస్తున్నాయి. వాటికి సరైన వైద్య చికిత్స చేయించి, చక్కగా తీర్చిదిద్దిన స్వచ్ఛంద సంస్థ వాటిని అక్కడికి పంపింది.

పికాబో వీడియోని స్ట్రే డాగ్ సపోర్ట్ ఇన్ కార్పొరేషన్ ఫేస్ బుక్ గ్రూప్ లో పోస్ట్ చేసినప్పుడు చాలా స్పందన కనిపించింది. కేవలం వీధి కుక్కలను సంరక్షించాలన్న సదుద్దేశంతో ఏర్పాటైన గ్రూప్ ఇది. పికాబో యూఎస్ కి వెళ్లిన తర్వాత కొత్త ఫ్యామిలీ సంరక్షణలో హాయిగా ఉంది. పైగా దానికి మొన్న క్రిస్ మస్ కి వాళ్లు చక్కటి బొమ్మనికూడా బహుమతిగా ఇచ్చారు. అక్కడివాళ్లు కుక్కల్నికూడా కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమించి ఆదరిస్తారు. ఏ జన్మలో పుణ్యమోగానీ ప్రస్తుతం పికాబోకి ఆ అదృష్టం పట్టింది.

మరో రెండు వీధి కుక్కలు పోస్టో, చోచోరీలు కూడా అమెరికాలో ఇప్పుడు కొత్త ఇళ్లలో, కొత్త కుటుంబాల సంరక్షణలో ఉన్నాయి. ఓ వీధి కుక్క ప్రసవించిన తర్వాత చనిపోయింది. పుట్టిన నాలుగు పిల్లల్లో మూడు చనిపోయాయి ఒక్కటి మాత్రం బతికింది. దానిపేరే గ్జీనా. ఇప్పుడు గ్జీనాని ఓ కెనడియన్ పౌరుడు దత్తత తీసుకున్నాడు. గ్జీనా ఇప్పుడు కెనడాలోని వాంకూవర్ ద్వీపంలో ఉన్న పోర్ట్ అల్ బెర్నీలోని తన కొత్త యజమాని ఇంట్లో ముద్దులుగుడుస్తూ సంతోషంగా ఉంది.

2019లో ఈ స్వచ్ఛంద సంస్థ ఇలాంటి 43 కుక్కల్ని కెనడాకు, అమెరికాకు, ఇంగ్లండ్ కి పంపించింది. వీటిలో 21 కుక్కలు పక్షవాతంతో కాళ్లు పడిపోయినవి, గుడ్డివి, చెవిటివి ఇంకా అనేక రకాలైన వైకల్యాలు ఉన్నవి. మిగతా 39 కుక్కలు అనాధలు. మొత్తం గడచిన నాలుగేళ్లలో 117 వీధి కుక్కల్ని చేరదీసి ఈ సంస్థ ఇలా విదేశాలకు పంపించడం విశేషం.

ఈ సంస్థకు చెందిన వాలంటీర్లు దత్తతకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకుంటారు. కుక్కను దత్తత చేసుకుంటామని అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్లలో ఎవరు యోగ్యులో నిర్ణయించాకే వాళ్లకు ఈ కుక్కల్ని పంపడం జరుగుతోందని వాళ్లు చెబుతున్నారు. కేవలం సరైనవాళ్లకు ఈ కుక్కల్ని అప్పజెప్పడమే వాలంటీర్ల పని, మొత్తం దానికి అవసరమైన ఖర్చులన్నింటినీ దత్తత తీసుకునేవాళ్లే భరిస్తారు.

ఇండియన్‌ డాగ్స్‌కు డిమాండ్‌

భారత దేశం నుంచి కెనడా, అమెరికా, యూకే, యూరోప్ లకు ఇలా కుక్కల్ని పంపించడానికి అయ్యే ప్రయాణ ఖర్చులు రూ.లక్ష నుంచి రూ. 2 లక్షలు వరకూ ఉంటాయని ఈ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కుక్కలతోపాటుగా వాటిని వాళ్లకు అప్పజెప్పడానికి అక్కడికి వెళ్లే మనిషికికూడా రానూపోనూ ప్రయాణ ఖర్చులన్నింటినీ ఈ కుక్కల్ని దత్తత చేసుకోవాలనుకునేవాళ్లు చెల్లిస్తున్నారని ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

చివరికి మన నాటు కుక్కలు ప్రపంచవ్యాప్తంగా అందరి అభిమానాన్నీ, ప్రేమనూ పొందగలగడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సంస్థ నిర్వాహకులు అంటున్నారు. అంటే భారత దేశంలో ఉన్న వీధి కుక్కలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ, అభిమానం బాగా పెరుగుతున్నట్టే లెక్కని చెబుతున్నారు. మెల్లగా ఈ అభిమానం బాగా పెరిగితే ఇక నేరుగా ఇండియన్ డాగ్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ చాలా పెరగొచ్చంటున్నారు. ఏది ఎలా ఉన్నా అత్యంత దీన స్థితిలో ఉన్న కుక్కలకు ప్రాణదానం చేస్తున్న మంచి మనుషుల్ని మెచ్చుకునే తీరాలని వీళ్లు అంటున్నారు.

Next Story