ఓపెనర్లు ఫెయిల్‌.. శతకంతో రాణించిన తెలుగు కుర్రాడు విహారి

By Newsmeter.Network  Published on  14 Feb 2020 12:37 PM GMT
ఓపెనర్లు ఫెయిల్‌.. శతకంతో రాణించిన తెలుగు కుర్రాడు విహారి

కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఈ నెల 21 నుంచి ఆడనుంది. ఇప్పటకే వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన టీమిండియాకు ఇప్పుడు మరో చిక్కు వచ్చి పడింది. రెగ్యులర్‌ ఓపెనర్‌ రోహిత్ శర్మ దూరం కావడంతో మొదటి టెస్టులో ఎవరిని ఓపెనర్‌గా పంపాలి అన్న ధానిపై టీమిండియా మల్లగుల్లాలు పడుతోంది. ఈ ప్రశ్నకు న్యూజిలాండ్‌ ఎలెవన్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్ సమాధానం ఇస్తుందని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించింది.

అయితే.. న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో శుక్రవారం ఆరంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ జట్టు పేలవ రీతిలో కుప్పకూలింది. తెలుగు కుర్రాడు హనుమ విహారి (101 రిటైర్డ్ ఔట్: 182 బంతుల్లో 10పోర్లు, 3సిక్సర్లు), చతేశ్వర్ పుజారా (93: 211 బంతుల్లో 11పోర్లు, 1 సిక్సర్‌) నిలకడగా ఆడినప్పటికీ.. మిగత బ్యాట్స్‌మెన్‌లు విఫలమయ్యారు. దీంతో 78.5 ఓవర్లలోనే 263 పరుగులకి ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో ఇస్ సోధి, కుగ్లీన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. గిబ్సన్ రెండు, నీషమ్ ఒక వికెట్ తీశారు. మూడు రోజుల ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్నాయి.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృథ్వీ డకౌటవ్వగా, మయాంక్‌ ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన గిల్ కూడా ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరాడు. అజింక్య రహానె (18), రిషబ్ పంత్ (7) కూడా నిరాశపరిచారు. దీంతో.. టీమిండియా చాలా తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. ఐదో వికెట్‌కి పుజారా, తెలుగు కుర్రాడు హనుమ విహారి 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక పుజారా ఔటైన తరువాత భారత పతనం వేగంగా సాగింది. సాహా (0), అశ్విన్ (0), జడేజా (8) వరుసగా పెవిలియన్ చేరిపోగా ఉమేశ్ యాదవ్ (9) చివరి వరకూ అజేయంగా నిలిచాడు.

ముగ్గురిలో ఓపెనింగ్‌ జోడి ఏదీ..?

india vs new zealand xi practice

ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ స్వదేశంలో పరుగుల వరద పారించి.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఇటీవల మయాంక్‌ ఫామ్‌ కూడా గొప్పగా లేదు. భారత్‌ ‘ఎ’ జట్టు తరఫున అనధికారిక టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ డకౌటయ్యాడు. అంతేకాకుండా మూడు వన్డేల సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. ఇప్పుడు తాజాగా సన్నాహక మ్యాచ్‌లోనూ ఒక్క పరుగే చేశాడు. మరోవైపు పృథ్వీ షా.. వన్డే సిరీస్‌లో ఫర్వాలేదనిపించినా భారీ స్కోర్లు సాధించలేదు. కాగా.. ‘భారత్‌-ఎ’ మ్యాచ్‌లలో శుభమన్‌.. గిల్‌ చెలరేగాడు. అనధికారిక తొలి టెస్టులో 83, 204*, రెండో టెస్టులో 136 స్కోర్లతో రాణించినా.. తాజా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గిల్ కూడా విఫలమవ్వడం టీమ్‌ఇండియాను కలవరపెడుతోంది. దీంతో తొలి టెస్టులో ముగ్గురిలో ఎవరికి ఓపెనర్లుగా అవకాశం దక్కుతుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story
Share it