కోహ్లీ, బుమ్రాకు విశ్రాంతి.. రిషబ్ పంత్ కు ఛాన్స్..!
By Newsmeter.Network Published on 1 Feb 2020 9:46 PM ISTన్యూజిలాండ్ గడ్డ పై టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఆడిన 4టీ20ల్లో విజయం సాధించింది. ఆదివారం మౌంట్ మాంగనీగా జరగనున్న ఐదో టీ20 విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తోండగా.. కనీసం ఈ మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ ఆరాటపడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేస్తుంది. దీంతో ఐదు లేదా అంతకంటే ఎక్కువ టీ20 మ్యాచ్‌లు గల సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది.
ఇప్పటికే సిరీస్ సొంతమైన తరుణంలో టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. నాలుగో టీ20లో విఫలమైన సంజు శాంసన్, శివమ్ దూబేలకు మరో అవకాశం ఇవ్వనున్నారు. అలాగే రిజర్వ్ బెంచ్ లో ఉన్న రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్‌లను పరీక్షించే అవకాశముంది. కాగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు యార్కర్ల స్పెషలిస్టు బుమ్రాకు విశ్రాంతి నిచ్చే అవకాశం ఉంది. నాలుగో టీ20లో ఆడని రోహిత్ శర్మ, షమిలు ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనున్నారు.
31 పరుగుల దూరంలో రోహిత్..
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో 14వేల పరుగులు పూర్తి చేయడానికి మరో 31 పరుగులు కావాలి. అన్ని ఫార్మాట్లు కలిపి ఇప్పటి వరకు రోహిత్ 13,969 పరుగులు చేశాడు. నాలుగో టీ20లో రోహిత్ కు విశ్రాంతి నివ్వగా నేడు బరిలోకి దిగనున్నాడు. హిట్ మ్యాన్ మరో 31 పరుగులు సాధిస్తే.. 14వేల పరుగులు పూర్తి చేసుకున్న ఎనిమిదో భారత క్రికెటర్‌గా నిలుస్తాడు. బ్యాటింగ్ పరంగా టీమిండియాకు పెద్దగా ఇబ్బందులు లేవు. రిషబ్ పంత్ కు అవకాశం ఇవ్వాలని టీమ్ మేనెజ్‌మెంట్ భావిస్తే రాహుల్ కు విశ్రాంతి ఇవ్వనున్నారు. కంగారూలతో వన్డే సిరీస్‌లో కంకషన్‌తో బాధపడుతున్న రిషభ్ పంత్ స్థానంలో కీపింగ్ చేశాడు కేఎల్ రాహుల్. అప్పట్నుంచి అతడే ప్రతి మ్యాచ్‌లో అదనంగా కీపింగ్ బాధ్యతలు మోస్తున్నాడు. రాణిస్తున్నాడు. జట్టులో సరికొత్త ఆశలు రేకెత్తించాడు. ఇదే అదనుగా కెప్టెన్ కోహ్లీ మరిన్ని ప్రయోగాలు మొదలుపెట్టాడు. రిషభ్ పంత్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే అతడికి ఎంతో ఒత్తిడి పెరిగింది. అటు కీపింగ్ ఇటు బ్యాటింగ్‌లో రాణించక తప్పని పరిస్థితి నెలకొంది. ధోనీకి వారసుడిగా భావించిన అతనిప్పుడు తొలి ప్రాధాన్య కీపర్ కాకుండా పోయాడు.
కోహ్లీకి విశ్రాంతి నిచ్చిన పక్షంలో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, సంజు శాంసన్ రానుండగా శ్రేయస్ మూడో స్థానంలో, అర్ధశతకంతో ఫామ్‌లోకి వచ్చిన మనీశ్ పాండేకు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో శాంసన్ త్వరగా ఔటవుతున్నాడు. అతడు సహనంతో ఆడాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. భారీ షాట్లు ఆడగల దూబె ఫుట్‌వర్క్ మెరుగుపర్చుకొని సత్తా నిరూపించుకోవాలి.
కలిసిరాని సూపర్ ఓవర్లు..
గెలవాల్సిన మ్యాచుల్లో ఓటమి పాలవ్వడం న్యూజిలాండ్‌ను వేధిస్తోంది. ప్రపంచకప్ నాటి నుంచి వారికి సూపర్ ఓవర్లు అంటేనే వణుకు పుడుతోంది. అలాంటిది ఈ సిరీస్‌లో వరుసగా రెండు సూపర్ ఓవర్లు ఆడి ఓటమి పాలవ్వడం మరింత బాధిస్తోంది. దక్షిణాఫ్రికా తరహాలో ఆఖర్లో ఒత్తిడికి చిత్తవుతున్నారు. ఈ మ్యాచులోనైనా గెలిచి వన్డే సిరీస్‌కు ఆత్మస్థైర్యంతో వెళ్లాలని భావిస్తోంది. భుజం గాయంతో దూరమైన విలియమ్సన్ కోలుకున్నాడని తెలిసింది. అతడు తర్వాత మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. ఇంతకుమించి ఆతిథ్య జట్టులో మార్పులేమీ ఉండకపోవచ్చు.