ఇక ప్రయోగాలే..
By Newsmeter.Network Published on 30 Jan 2020 4:22 PM GMT
కివీస్ గడ్డపై తొలి టీ20 సిరీస్ విజయాన్ని సాధించింది టీమిండియా. 5టీ20ల సిరీస్ లో మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. మూడో మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ఇక మిగిలిన రెండు టీ20ల్లో రిజర్వు బెంచ్ ఆటగాళ్లను పరీక్షించనున్నట్లు చెప్పాడు. ఇక నాలుగో టీ20 మ్యాచ్ వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రారంభంకానుంది.
టీ-20 ప్రపంచకప్‌కి ముందు జరుగుతున్న సుదీర్ఘ టీ-20 సిరీస్ కావడంతో.. ఈ సిరీస్‌లో ప్రయోగాలు చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ బావిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ ను మరింత పటిష్టంగా చేయాలని అనుకుంటోంది. టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ భారాన్ని మోస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లి, హిట్ మ్యాన్ రోహిత్ శర్మలలో ఒకరికి విశ్రాంతి నిచ్చే సూచనలు ఉన్నాయి. వీరి ప్లేస్ లో రిజర్వు ఆటగాళ్లను పరీక్షించనున్నారు. రిషబ్ పంత్ గాయపడడంతో ఆస్థానాన్ని భర్తీ చేస్తున్న రాహుల్ పై అదనపు ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.
రిజర్వు ఆటగాళ్లలో ఇద్దరు వికెట్ కీపర్లుగా ఉన్న సంజు శాంసన్, రిషబ్ పంత్ లలో ఒకరికి అవకాశం దక్కనుంది. ఒక వేళ శ్రేయాస్ అయ్యర్ కు కూడా రెస్ట్ ఇస్తే ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కనుంది. రిషబ్ పంత్ పై నమ్మకం ఉంచి టీమ్‌మేనేజ్‌మెంట్ అనేక అవకాశాలు ఇచ్చింది. అవన్నీ తను వృధా చేశాడు. కాగా సంజు ను మూడేళ్ల కాలంలో 2టీ20 మ్యాచుల్లో మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. దీంతో సంజు కు అవకాశం ఇవ్వాలని.. శాంసన్ రాణిస్తే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు అతను అదనపు బలంగా మారుతాడని మాజీలు విశ్లేషిస్తున్నారు. మరీ వీరిద్దరిలో టీమ్ మేనేజ్‌మెంట్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.
బౌలింగ్‌లోనూ ప్రయోగాలు చేయనున్నారు. కుల్దీప్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్‌లు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. టీ-20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరుగనుంది. న్యూజిలాండ్ వాతావరణం, ఆస్ట్రేలియా వాతావరణం దాదాపుగా ఒకేలా ఉండడంతో వీరిని పరీక్షించాలను కుంటోంది. ఆస్ట్రేలియాలోని స్టేడియంలలో సుందర్ బౌలింగ్ పని చేసే అవకాశం ఉంది. మరోవైపు నవ్‌దీప్ సైనీ కూడా ప్రత్యర్థి జట్టు పరుగులు చేయకుండా అడ్డుకట్ట వేయగలడు. దీంతో తర్వాతి రెండు టీ20ల్లో వీరిద్దరిని జట్టులో తీసుకొనే అవకాశం ఉంది.
ప్రపంచకప్‌లో గాయపడిన బుమ్రా ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌లు గ్యాప్ తీసుకొని మళ్లీ జట్టులోకి వచ్చాడు. అప్పటి నుంచి విరామం లేకుండా అతను ఆడుతున్నాడు. దీంతో అతనిపై కూడా పని భారం పెరిగింది. ఈ క్రమంలో ఈ రెండు మ్యాచ్‌ల నుంచి అయినా.. అతనికి విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది. స్పిన్‌లో ప్రయోగం చేయాలనే ఉద్దేశంతో కుల్దీప్, చాహల్ ఇద్దరితో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మరి కోహ్లీ ఎటువంటి మార్పులతో చివరి రెండు మ్యాచుల్లో ప్రయోగాలు చేస్తాడో తెలియాలంటే వేచిచూడాల్సిందే..