కివీస్ పై సరికొత్త వ్యూహాలతో కోహ్లి సేన సిద్ధం..!

By Newsmeter.Network  Published on  23 Jan 2020 4:35 PM GMT
కివీస్ పై సరికొత్త వ్యూహాలతో కోహ్లి సేన  సిద్ధం..!

టీమిండియా కొత్త ఏడాదిలో తొలి విదేశీ ప‌ర్య‌ట‌నను విజ‌యంతో ఆరంభించాల‌ని భావిస్తోంది. న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా ఐదు టీ20లు, మూడు వ‌న్డేలు, రెండు టెస్టు మ్యాచులు ఆడ‌నుంది. ఈ సుధీర్ఘ ప‌ర్య‌ట‌న శుక్ర‌వారం జ‌రిగే తొలి టీ20 మ్యాచుతో ఆరంభం కానుంది. ప్ర‌పంచ క‌ప్ సెమీస్ లో న్యూజిలాండ్ తో ఓట‌మి అనంత‌రం ఇంత వ‌ర‌కు టీమిండియా కివీస్ తో మ్యాచ్ ఆడ‌లేదు. టీ20 సిరీస్ గెలిచి ఆ ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని కోహ్లి సేన ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ ఏడాది అక్టోబ‌ర్ లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌ర‌గ‌నుండ‌డంతో కివీస్ తో మ్యాచ్ ల ద్వారా వ‌ర‌ల్డ్ క‌ప్ తుది జ‌ట్టు పై అంచ‌నాకు రావాల‌ని మేనేజ్‌మెంట్ అనుకుంటుంది.

చ‌లిగాలులు, కారు మ‌బ్బులు క‌మ్మి ఉండే న్యూజిలాండ్ వాతావ‌ర‌ణంలో రాణించ‌డం అంత ఆషామాషి విష‌యం కాదు. ఆక్లాండ్‌ వేదికగా జరిగే తొలి మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టాలని కోహ్లి సేన భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాలు రచిస్తోంది. కాగా రేప‌టి మ్యాచ్ లో వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ ను ఆడించ‌కపోవ‌చ్చు. అంతేకాకుండా కేర‌ళ కుర్రాడు సంజు శాంస‌న్ కూడా తుది జ‌ట్టులో ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే వికెట్ కీప‌ర్ గా ఇప్ప‌టికే కేఎల్ రాహుల్ పుల్ స‌క్సెస్ కావ‌డంతో వీరిద్ద‌రికి తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌చ్చు. ఐదో స్థానంలో మ‌నీష్ పాండే ను కొన‌సాగించాల‌ని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మ‌నీష్ కు మ‌రిన్ని అవ‌కాశాలు ఇచ్చి అత‌డి సత్తా ఏమిటో తెలుసుకోవాల‌ని చూస్తుండ‌డంతో స్పెష‌లిస్టు వికెట్ కీప‌ర్ ను తీసుకోకుండానే బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న రోహిత్‌ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా ధావన్ దూరం కావ‌డంతో రోహిత్ క‌లిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ కి రానున్నాడు. ఫ‌స్టు డౌన్ లో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయ‌స్ అయ్య‌ర్ లు ఫామ్ లో ఉండ‌డం టీమిండియాకు క‌లిసి వ‌చ్చే అంశం. ఐదో స్థానంలో మ‌నీష్ పాండే విదేశాల్లో ఎలా రాణిస్తాడో వేచి చూడాల్సిందే.

టీమిండియా బ్యాటింగ్ దుర్బేద్యంగా ఉండటంతో కివీస్‌తో జరిగే తొలి టీ20లో ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాలనే ఆలోచనలో టీమిండియా ఉంది. స్పెషలిస్టు వికెట్‌ కీపర్‌ను తీసుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణమని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. పేస్‌ విభాగంలో జస్ప్రిత్‌ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీలు జట్టులో ఉండటం పక్కా అని తెలుస్తోంది. ఇక స్పిన్నర్లుగా వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చహల్‌లు జట్టులో ఉండే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, సుందర్‌లు బ్యాటింగ్‌ కూడా చేయగల సమర్థులు కావడంతో ఆరుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగాలని కోహ్లి భావిస్తున్నాడు.

Next Story