మూడోరోజే ముగించేశారు.!

By Medi Samrat  Published on  16 Nov 2019 12:37 PM GMT
మూడోరోజే ముగించేశారు.!

ముఖ్యాంశాలు

  • తొలి టెస్టులో భారీ విజ‌యం
  • ఇన్నింగ్స్ 130 ప‌రుగుల తేడాతో విక్ట‌రీ
  • మ‌రోమారు రాణించిన ష‌మీ

బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలిటెస్టులో టీమిండియా భారీ విజయం సాధించి శుభారంభం చేసింది. ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో జయభేరీ మోగించి బంగ్లాను చిత్తుచేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాను కేవ‌లం 213 పరుగులకే క‌ట్ట‌డి చేసి భారీ విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ నాలుగు వికెట్లు సాధించగా, అశ్విన్‌ మూడు వికెట్లతో మెరిశాడు. ఉమేశ్‌ యాదవ్‌కు రెండు, ఇషాంత్‌కు వికెట్‌ లభించింది.

మూడోరోజు శనివారం ఆటలో భాగంగా 493/6 ఓవర్‌నైట్‌ స్కోరు వద్ద టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్డ్‌ చేసింది. అనంత‌రం బంగ్లా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెన‌ర్లు 16 పరుగులకే అవుట్ అవ‌డంతో బంగ్లా కష్టాల్లో పడింది. తర్వాత కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌(7), మహ్మద్‌ మిథున్‌(18)లు సైతం నిరాశపరచడంతో బంగ్లా తేరుకోలేకపోయింది.

అయితే.. బంగ్లా స్టార్ ఆట‌గాడు ముష్ఫికర్‌ రహీమ్(64) బ్యాట్ ఝ‌ళిపించ‌డంతో బంగ్లా గాడిలో పడినట్లు కనిపించింది. కానీ, మరొకవైపు వికెట్లు కోల్పోతూ వచ్చింది. బంగ్లా ఆట‌గాళ్ల‌లో లిటాన్‌ దాస్‌(35), మెహిదీ హసన్‌(38)లు మాత్రమే చెప్పుకోద‌గ్గ ప్కోర్లు సాధించారు. భారత బౌలర్లు చెలరేగడంతో టెస్ట్ మూడో రోజే ముగించింది.

Next Story