చిన్న‌స్వామి ఎవ‌రిదో..?

By Newsmeter.Network  Published on  19 Jan 2020 5:57 AM GMT
చిన్న‌స్వామి ఎవ‌రిదో..?

భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ లో 1-1 తో ఇరు జ‌ట్లు స‌మానంగా నిలిచాయి. నిర్ణ‌యాత్మ‌క‌మైన మూడో వ‌న్డే నేడు బెంగుళూరు వేదిక‌గా చిన్న‌స్వామి స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ చేజిక్కుకోవాల‌ని ఇరు జ‌ట్లు ఆరాట‌ప‌డుతున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ ఆధిపత్యం ప్రదర్శించగా రెండో మ్యాచ్‌లో భారత్‌ తమ స్థాయిని ప్రదర్శించింది.

సుదీర్ఘమైన విదేశీ పర్యటనకు ముందు టీమిండియా స్వ‌దేశంలో ఆడే చివ‌రి వ‌న్డే ఇదే. రెండు జట్లు కూడా దాదాపు సమఉజ్జీలుగా కనిపిస్తుండటంతో పాటు భారీ స్కోర్ల వేదికైన చిన్న‌స్వామిలో మ‌రో హోరాహోరీ పోరును అభిమానులు ఆశించ‌వ‌చ్చు..

టీమిండియాకు గాయాల బెడ‌ద‌..

చిన్న‌స్వామి అంటే హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ పండ‌గ చేసుకుంటాడు. అంత‌లా ఉంది అత‌ని రికార్డు ఇక్క‌డ. చిన్నస్వామి స్టేడియంలో రోహిత్ మూడు వ‌న్డేలు ఆడ‌గా ఓ డ‌బుల్ సెంచ‌రీతో స‌హా 318 ప‌రుగులు చేశాడు హిట్ మ్యాన్. అయితే రెండో వ‌న్డేలో ఫీల్డింగ్ చేస్తుండ‌గా బౌండ‌రీ లైన్ వ‌ద్ద బంతిని ఆపై క్ర‌మంలో రోహిత్ భుజానికి గాయ‌మైంది. గాయం విష‌య‌మై ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ నుంచి గానీ, బీసీసీఐ నుంచి గానీ ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు. మ్యాచ్ అనంత‌రం విరాట్ మాట్లాడుతూ.. రోహిత్ కు అయిన గాయం చిన్న‌దేన‌ని భావిస్తున్నాన‌ని త‌దుప‌రి మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడ‌ని చెప్పాడు. మ‌రీ రోహిత్ అచ్చొచ్చిన స్టేడియంలో ఆడ‌తాడో..? లేదో..? ఇక‌ మరో ఓపెనర్‌ ధావన్‌ గాయం గురించి కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

ఓపెనర్లతో పాటు రాహుల్‌ అద్భుత ఫామ్‌ భారత్‌కు అదనపు బలంగా మారింది. పైగా అతను ఇప్పుడు సొంత మైదానంలో ఆడబోతున్నాడు. వీరందరికీ కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్‌ తోడైతే భారత్‌ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. కీల‌క‌మైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ వ‌స్తున్న శ్రేయాస్ అయ్య‌ర్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది జ‌ట్టు మేనేజ్‌మెంట్. ఇక పంత్ స్థానంలో చోటు ద‌క్కించుకున్న మ‌నీష్ పాండే కూడా బ్యాట్ ఝుళిపించాల్సిన అవ‌స‌రం ఉంది. రెండో వన్డేలో భారత బౌలర్లు కూడా మంచి ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా బుమ్రా తొలి స్పెల్‌ చూస్తే అతను మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు అర్థమవుతోంది. స్పిన్నర్‌గా మళ్లీ కుల్దీప్‌కే అవకాశం ఖాయం.

జోష్ లో ఆసీస్..

మొద‌టి వ‌న్డేలో టీమిండియాకు షాకిచ్చిన ఆస్ట్రేలియా రెండో వ‌న్డేలో 300 పైగా చిలుకు లక్ష్యాన్ని చేదించే క్ర‌మంలో స్వ‌ల్ప తేడాతోనే ఓడింది. ఇది ఆ జ‌ట్టు ఆత్మ‌విశ్వాస్వాన్ని ఎంత మాత్రం దెబ్బ‌తీయ‌దు. ఐపీఎల్‌ ద్వారా భారత పిచ్‌లపై రాటుదేలిపోయిన వార్నర్‌కు మరో భారీ ఇన్నింగ్స్‌ ఆడగల సత్తా ఉంది. కెప్టెన్ ఫించ్‌తో కలిసి శుభారంభం చేస్తే భారత్‌కు ఇబ్బందులు తప్పవు. వ‌న్డేల్లో తాను ఎంత కీలకమో స్మిత్‌ చూపించగా లబ్‌షేన్ కూడా అతనికి సరి జోడీగా నిలిచాడు. వీరిద్దరు కలిసి మ్యాచ్‌ స్వరూపం మార్చేయగలరు. మిడిలార్డర్‌లో క్యారీ, టర్నర్‌ మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. రెండో వన్డేలో భారీగా పరుగులు ఇచ్చుకున్నా స్టార్క్‌ ఆసీస్‌ నంబర్‌వన్‌ బౌలర్‌ అనడంలో సందేహం లేదు. అతనికి తోడుగా కమిన్స్‌ చెలరేగుతున్నాడు. టూర్‌లో చివరి మ్యాచ్‌ కాబట్టి రిచర్డ్సన్‌ స్థానంలో హాజల్‌వుడ్‌కు అవకాశం దక్కవచ్చు.

పిచ్..

బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌. పరుగుల వరద పారే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఎక్కువే కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు. మ్యాచ్‌ రోజు వర్షసూచన లేదు.

చిన్నస్వామి స్టేడియంలో భారత్, ఆ్రస్టేలియా మధ్య 7 వన్డేలు జరగ్గా భారత్‌ 4 ఓడి 2 గెలిచింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. చివరగా సెప్టెంబర్, 2017లో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ సెంచరీ సహాయంతో ఆసీస్‌ 21 పరుగులతో నెగ్గింది.

Next Story