సమం చేస్తారా..? అప్పగించేస్తారా..?
By Newsmeter.Network Published on 17 Jan 2020 4:24 AM GMTవరుస విజయాల జోష్ లో ఉన్న టీమిండియాకు తొలి వన్డేలో ఆస్ట్రేలియా షాకిచ్చింది. ఆస్ట్రేలియా ధాటికి భారత జట్టు అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమై అవమానకరమైన ఓటమిని మూటగట్టుకుంది. కాగా నేడు రాజ్ వేదికగా జరిగే రెండో వన్డేలో గెలిచి సిరీస్ లో నిలవాలని భారత్ పట్టుదలతో ఉండగా.. రెండో వన్డేలో కూడా విజయం సాధించి ఇక్కడే సిరీస్ సాధించాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతుంది.
మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రయోగాలకు పోయిన భారత జట్టు ఇప్పుడు కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ సేన ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి. సిరీస్ లో 0-1తో వెనుకబడిన భారత జట్టు పుంజుకొని 1-1తో సమం చేయక పోతే ఆస్ట్రేలియా సిరీస్ ను ఎగురవేసుకుని పోవడం ఖాయం. గతేడాది ఐదు వన్డేల సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే తీవ్రంగా నిరుత్సాహపరిచింది. పసికూన జట్టుని తలపించింది. ప్రపంచ అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లతో కూడిన జట్టు ఇదేనా అనిపించేలా వీరి ప్రదర్శన సాగింది.
కోహ్లీ ఏ స్థానంలో...
మొదటి వన్డేల్లో బ్యాటింగ్ ఆర్డర్ లో చేసిన మార్పులు పెద్దగా సత్ఫలితాన్ని ఇవ్వలేదు. రెండో వన్డేలో అలాంటి పొరపాట్లు చేయకూడదని టీమ్ మేనేజ్‌మెంట్ గట్టిగా భావిస్తోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ రానుండగా మూడో స్థానంలో రికార్డుల రారాజు కోహ్లీనే పంపాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఇక కీలకమైన నెంబర్ ఫోర్ స్థానంలో ఎవరు ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. గత కొంత కాలంలో ఆస్థానానికి తానే కరెక్టు అనే విధంగా శ్రేయాస్ అయ్యర్ రాణిస్తుండగా తొలి వన్డేలో మూడో స్థానంలో దిగిన రాహుల్ నాలుగో స్థానంలో ఆడించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా రిషబ్ గాయంతో తప్పుకోవడంతో మనీష్ పాండే కు లైన్ క్లియర్ అయ్యింది. మనీష్ కూడా జట్టులోకి వస్తే నాలుగో స్థానంలో ఎవరు ఆడతారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. తొలి మ్యాచ్‌లో ధవన్, రాహుల్ అదరగొట్టినా రోహిత్ విఫలమయ్యాడు. ఈసారి అతడు బ్యాట్ ఝుళిపిస్తే ఆసీస్ బౌలర్లకు కష్టాలు తప్పవు.
తొలి మ్యాచ్ లో భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా తేలిపోయాడు. గాయం నుంచి కోలుకున్న బుమ్రా తన లయను అందుకోవాల్సి ఉంది. బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లకు కష్టాలు తప్పవు. కుల్దీప్ స్థానంలో చాహల్‌ను తీసుకునే అవకాశం ఉంది.
జోరు కొనసాగించాలని...
మొదటి వన్డే ఇచ్చిన ఉత్సాహాంతో ఆస్ట్రేలియా పుల్ జోష్ లో ఉంది. భారత్ పై ఆస్ట్రేలియాకు వన్డేల్లో వరుసగా నాలుగో విజయం. ఇదే ఆత్మవిశ్వాసంతో ఈ జట్టు వరుసగా రెండో సిరీస్ పై కన్నేసింది. ఇక ఆ జట్టు ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ లు పుల్ ఫామ్ లో ఉన్నారు. మిడిలార్డర్‌లో స్మిత్, లబుషేన్, టర్నర్, కేరీ బరిలోకి దిగేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. టెస్టుల్లో అదరగొట్టిన లబుషేన్ వన్డేల్లో తన సత్తాచాలని చూస్తున్నాడు. బౌలర్లు స్టార్క్, కమిన్స్, జంపా, అగర్ కీలక సమయాల్లో వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీశారు. మొత్తంగా ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాను ఓడించాలంటే భారత్ చెమటోడ్చక తప్పదు
పిచ్, వాతావరణం : రాజ్ కోట్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. డే నైట్ మ్యాచ్ కాబట్టి మంచు కీలక పాత్ర పోషించనుంది. మంచు ప్రభావంతో బౌలర్లు ఇబ్బందిపడతారు కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం వర్షం నుంచి మ్యాచ్‌కు ముప్పులేదు.
కలవర పెడుతున్న రాజ్ కోట్ రికార్డులు...
భారత క్రికెట్ జట్టు రాజ్‌కోట్‌లో ఇప్పటిదాకా ఆడిన మూడు వన్డేల్లోనూ ఓడిపోయింది. 2013లో ఇంగ్లండ్‌తో, 2015లో దక్షిణాఫ్రికాతో, 1986 అక్టోబరు ఏడున పాత స్టేడియంలో ఆసీస్‌తో ఆడిన భారత్‌కు ఓటములే ఎదురయ్యా యి. అయితే భారత్ ఇక్కడ ఆసీస్‌తో ఆడిన ఏకైక టీ20 మ్యాచ్‌లో మాత్రం నెగ్గింది. ఇదొక్కటే ఇక్కడ సానుకూలాంశం. ఎలాగైన గత రికార్డులను తిరగరాయాలని కోహ్లీ సేన పట్టుదలతో ఉంది..