స్టీవ్ స్మిత్ శతకం.. టీమిండియా విజయలక్ష్యం 287
By Newsmeter.Network Published on 19 Jan 2020 5:37 PM ISTబెంగళూరులోని చిన్నస్వామి వేదికగా టిమిండియాతో జరుగుతున్న మూడో వన్డేల్లో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు సాధించింది. ఆ జట్టు మాజీ సారథి స్టీవ్ స్మిత్ (131; 132 బంతుల్లో 14పోర్లు, 1సిక్సర్) అద్భుత శతకంతో రాణించడంతో ఆస్ట్రేలియా టీమిండియా ముందు 287 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ కు భారత బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. 3 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ ను మహ్మద్ షమి పెవిలియన్ కు పంపగా.. సమన్వయ లోపంలో ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (19; 26 బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్) రనౌట్ అయ్యాడు. దీంతో 46 పరుగులకే ఆజట్టు ఓపెనర్లు వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో యువ క్రికెటర్ లబుషేన్ (54; 64బంతుల్లో 5పోర్లు) తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు స్టీవ్ స్మిత్. ఆరంభంలో ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మూడో వికెట్‌కు 127 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రవీంద్ర జడేజా విడదీశాడు.
అనంతరం భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ వేగంగా వికెట్లను కోల్పోయింది. లబుషేన్ అవుటైనా స్టీవ్ స్మిత్ ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో 9 శతకాన్ని సాధించాడు. స్కోర్ వేగాన్ని పెంచే క్రమంలో జట్టు స్కోర్ 273 పరుగుల వద్ద ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో మహ్మద్ షమి 4, జడేజా 2, నవదీప్ సైనీ, కుల్దీప్ చెరో వికెట్ సాధించారు.