కరోనా ఎఫెక్ట్‌.. భారత్‌-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ రద్దు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2020 7:18 PM IST
కరోనా ఎఫెక్ట్‌.. భారత్‌-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ రద్దు..

కరోనా వైరస్‌ ముప్పుతో ఇప్పటికే ఇండియన్‌ ప్రీమియర్‌లీగ్‌(ఐపీఎల్‌) ను వాయిదా వేసిన బీసీసీఐ(భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు) తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను రద్దు చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో ధర్మశాల వేదికగా జరగాల్సిన మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా మిగిలిన రెండు వన్డేలు లఖ్‌నవూ, కోల్‌కత్తాలో జరగాల్సి ఉండగా.. వాటిని బీసీసీఐ రద్దు చేసింది.

ఇప్పటికే ఐపీఎల్‌ వాయిదా వేశాం. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా సిరీస్‌ను రద్దు చేయడమే మేలు. దేశం తీవ్రమైన మహమ్మారిని ఎదుర్కొంటోంది. దక్షిణాఫ్రికా జట్టు ఢిల్లీకి చేరుకుని అందుబాటులో ఉన్న విమానంలో వెళ్లిపోతుందని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం రెండు జట్లు రెండో వన్డే కోసం లఖ్‌నవూలో సాధన చేస్తున్నాయి. సిరీస్ రద్దు నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు లఖ్‌నవూ నుంచి ఢిల్లీని పయనమయ్యారు.

కరోనాను మహమ్మారిగా డబ్యూహెచ్‌వో ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆ క‍్రమంలోనే ఇప్పటికే పలు క్రీడా పోటీలు రద్దైన సంగతి తెలిసిందే. జనాలు గుమిగూడకుండా చూడాలని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ బీసీసీఐ సహా అన్ని క్రీడా సమాఖ్యలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాయిదా వేసేందుకు వీలవ్వని క్రీడలను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని సూచించింది. దీంతో ఐపీఎల్‌ను వాయిదా వేయడానికి బీసీసీఐ మొగ్గుచూపింది.

కనీసం రెండు వారాల పాటు వాయిదా వేయాలని ఫ్రాంచైజీలు కోరడంతో అందుకు బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. దాంతో ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ ఐపీఎల్‌ వాయిదా పడింది. మార్చి 29 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కావాల్సి ఉండగా, విదేశీ ఆటగాళ్ల వీసాల విషయంలో సమస్యలు తలెత్తడంతో దాన్ని వాయిదా వేయక తప్పలేదు.

Next Story