సెంచరీలతో చెలరేగిన ఆసీస్ ఓపెనర్లు.. టీమిండియా ఘోర ఓటమి..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Jan 2020 3:28 PM GMTఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఏ మాత్రం పోటీ ఇవ్వకుండానే ఆసీస్ ముందు తలవంచింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వాంఖేడే స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 255 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
లక్ష్యచేదనకు దిగిన ఆస్ట్రేలియా అవలీలగా ఛేదించింది.కేవలం ఒక వికెట్ కూడా కోల్పోకుండానే భారత్‌ను చిత్తు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్-అరోన్ ఫించ్‌లు సెంచరీలతో అదరగొట్టారు. టీమిండియా నిర్దేశించిన 256 పరుగుల టార్గెట్‌ను 37. 4 ఓవర్లలోనే చేధించారు. వార్నర్ 128(112 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫించ్ 110(114 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో అజేయంగా నిలిచారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ఇన్నింగ్సులో శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కేఎల్ రాహుల్(47) పరుగులతో అర్థసెంచరీ మిస్ చేసుకోగా.. మిగతా వారెవరూ రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు సాధించగా, కమిన్స్, రిచర్డ్‌సన్‌లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఆడమ్ జంపా, ఆగర్‌లకు చెరో వికెట్ దక్కింది. సెంచరీతో కదం తొక్కిన వార్నర్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఇక శుక్రవారం రాజ్‌కోట్‌లో రెండో వన్డే జరుగనుంది.