నగరాల్లో జనాభా పెరుగుతుండటంతో వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఎదురైంది. మన దేశంలో ప్రముఖ నగరాల్లో ప్రతీ ఏడాది పెరుగుతున్నవాహనాల కారణంగా అనేక ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. అంతేకాదు ఒక ఏడాదిలో అమెరికా, చైనా కంటే మన దేశంలోనే ఎక్కువగా కార్లు అమ్మకాలు జరిగాయని ఓ సర్వే స్పష్టం చేస్తోంది.

భారత్ నుంచి నాలుగు నగరాలు

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ట్రాఫిక్‌ ఉన్న నగరాలు గుర్తించేందుకు ప్రముఖ వాహనరంగ సంస్థ ‘టామ్‌ టామ్‌‘ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. సుమారు 57 దేశాల్లోని 416 నగరాల్లోని ట్రాఫిక్‌ రద్దీపై పూర్తి నివేదికను సిద్ధం చేసిన ఈ సంస్థ .. భారత్‌ భారీ ట్రాఫిక్‌ సమస్య ఎదుర్కొంటోందని సర్వే ద్వారా తేల్చి చెప్పింది. ఇక టాప్‌ 10 జాబితాలో భారత దేశం నుంచి 4 నగరాలు ఉండటం గమనార్హం.

ఈ ట్రాఫిక్‌ రద్దీలో బెంగళూరు 3వ స్థానంలో ఉండగా, ముంబాయి 4వ స్థానం, పుణే 5వ స్థానం, ఢిల్లీ 8వ స్థానంలో నిలిచాయి. ఈ నివేదిక ప్రకారం బెంగళూరు ప్రజలు అత్యధికంగా 71 శాతం తమ సమయాన్నిట్రాఫిక్‌లోనే గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక మరో వైపు టాప్‌ 10 జాబితాలో మనీలా, మాస్కో, లిమా, ఇస్తాంబుల్‌, బొగోటా నగరాలున్నాయి.

traffce

బెంగళూరు వాసులకు నరకమే..

ఇక ఇలా భారీ ట్రాఫిక్‌తో బెంగళూరులో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని కూడా ఈ ‘టామ్‌ టామ్‌’ సంస్థ క్లియర్‌గా వివరించింది. బెంగళూరులో సగటున 71 శాతం వరకు ట్రాఫిక్‌తో రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయని వివరించింది. ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లాలన్నా.. తిరిగి ఇంటికి వెళ్లాలన్నా బెంగళూరు వాసులు నరకం అనుభవిస్తున్నారట. అదే 2019 ఆగస్టు 20వ తేదీ బెంగళూరు ప్రజలు ఎన్నటికి మర్చిపోలేరని, ఆ రోజున నగరంలో ఏకంగా 103 శాతం ట్రాపిక్‌ నమోదు కాగా, ప్రజలు గంటల పాటు రోడ్లపైన నిలిచిపోక తప్పలేదట. అలాగే అతి తక్కువ ట్రాఫిక్‌ నమోదైన రోజుగా 2019, ఏప్రిల్‌ 6వ తేదీ అని సర్వే తెలిపింది. మొత్తం మీద బెంగళూరు వాసులు ట్రాఫిక్‌ సమస్యలో ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారో దీనిబట్టి అర్థమైపోతోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.