సెమీస్‌లోకి యువ భారత్..

By Newsmeter.Network  Published on  28 Jan 2020 4:10 PM GMT
సెమీస్‌లోకి యువ భారత్..

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ అదరగొడుతోంది. సెన్వెస్‌పార్క్‌ వేదికగా జరిగిన క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌ లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది.

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ పై ఉన్న పచ్చికను సద్వినియోగం ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో భారత బ్యాట్స్‌ మెన్లు ఇబ్బంది పడ్డారు. ఓ దశలో 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అయితే ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ (62; 82 బంతుల్లో 6పోర్లు, 2సిక్సర్లు)తో రవి బిష్ణోయి(30), సద్దేశ్‌ వీర్‌(25) లతో మంచి భాగస్వామ్యాలను నెలకొల్పాడు. చివర్లో అంథర్వ అంకోలేకర్‌ (55*; 54 బంతుల్లో 5పోర్లు, 1సిక్సర్‌) ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. ఆసీస్‌ జట్టులో టాడ్‌ ముర్ఫీ 5 వికెట్లు తీశాడు.

234 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 159 పరుగులకే ఆలౌట్‌ అయింది. కార్తిక్‌ త్యాగి, సుశాంత్‌ మిశ్రా మూడేసి వికెట్లు తీశారు. దీంతో 74 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మూడు సార్లు ఛాంపియన్‌ అయిన ఆస్ట్రేలియా 2008 తర్వాత ఒక్కసారి కూడా సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది

Next Story