116కు చేరిన భారత్ కరోనా బాధితుల సంఖ్య

By రాణి  Published on  16 March 2020 6:59 PM IST
116కు చేరిన భారత్ కరోనా బాధితుల సంఖ్య

భూమండలాన్నంతటినీ వణికిస్తూ..ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి..పెట్టుబడిదారులకు ఎన్నడూ చవిచూడని నష్టాలను తెచ్చిపెట్టిన కరోనా వైరస్ రోజురోజుకూ ప్రకృతి ప్రకోపానికి మారుపేరుగా తయారవుతోంది. తాజాగా మహారాష్ర్టలో నలుగు కేసులు నమోదవ్వడంతో..అక్కడున్న వైరస్ బాధితుల సంఖ్య 37కు చేరుకోగా..దేశంలో కరోనాబాధితుల సంఖ్య 116కు పెరిగింది.

Also Read : దేశ ఆర్థిక రంగం కుదేలైంది : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతాదాస్

కరోనా పై ఎవరూ ఆందోళన చెందవద్దని..మనం తీసుకునే జాగ్రత్తలను బట్టే వైరస్ ను అరికట్టవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ ఇన్ స్టా ద్వారా ప్రజలకు తెలియచేశారు. అలాగే కరోనా పై వస్తున్న వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి #Indiafightscorona హ్యాష్ టాగ్ తో తెలియజేశారు. చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా కరోనాను అరికట్టవచ్చన్నారు. తరచూ చేతులతో ముఖాన్ని, కళ్లను తుడుచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా సోకే ప్రమాదం ఉందని, అందుకే ఎప్పుటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటుండాలని సూచించారు. అలాగే ఆల్కహాల్ తో కూడిన శానిటైజర్లను వాడటం శ్రేయస్కరమని తెలిపారు. మీకు వైరస్ లక్షణాలున్నట్లు ఏ మాత్రం అనుమానం ఉన్నా..భయాన్ని వీడి డాక్టర్ ను సంప్రదించాలని మోదీ సూచించారు. ఏమాత్రం ఆలస్యం చేసినా ఆ వైరస్ కుటుంబం మొత్తానికి వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. ఇలా ఏడు నిమిషాల పాటు ఉన్న వీడియోను నరేంద్రమోదీ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు.

Also Read : సీఏఏ వ్యతిరేక తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

అలాగే దేశ రాజధానిలో కూడా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఆంక్షలు విధించారు. నెలాఖరులోపు 50 మందికన్నా ఎక్కువగా హాజరయ్యే అవకాశమున్న ఎలాంటి సమావేశాలు కానీ, ఫంక్షన్లు కానీ ఎక్కడా నిర్వహించరాదని ఆదేశించారు. నెలాఖరు వరకూ జిమ్ లు, నైట్ క్లబ్ లు, స్పా లను కూడా మూసివేయాలని కోరారు. అయితే పెళ్లిళ్లపై ఎలాంటి నిషేధం విధించకపోయినప్పటికీ..సాధ్యమైనంతవరకూ పెళ్లిళ్ల తేదీలను వాయిదా వేసుకోవడం మంచిదని సూచించారు.

Next Story