భారత్‌లో 24గంటల్లో 6,556 కేసులు.. 194 మరణాలు
By తోట వంశీ కుమార్
భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6,566 పాజిటివ్ కేసులు నమోదు కాగా 194 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,58,333కి చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి భారీన పడి 4,531 మంది మరణించారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 67,692 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 86,110 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గడిచిన వారం రోజులుగా దేశంలో 6వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌లలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే.. ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి నిష్ఫత్తి మెరుగ్గా ఉండడం ఊరట నిచ్చే అంశం. భారత్‌లో రికవరీ రేటు 42.45శాతంగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.