భారత్ లో 206 కరోనా కేసులు..శ్రీలంకలో 4 రోజులు కర్ఫ్యూ

By రాణి  Published on  20 March 2020 3:53 PM IST
భారత్ లో 206 కరోనా కేసులు..శ్రీలంకలో 4 రోజులు కర్ఫ్యూ

భారతదేశంలో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం ఉదయానికి 195 కేసులు నమోదవ్వగా..మధ్యాహ్నానికి కరోనా కేసుల సంఖ్య 204 కు పెరిగింది. తెలంగాణలోనే శుక్రవారం మధ్యాహ్నం వరకూ 18 కరోనా కేసులు నమోదైనట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వీరంతా ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చాకే కరోనా లక్షణాలు బయటపడ్డాయి కానీ..తెలంగాణ వాసుల్లో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని తెలిపారు. మరోవైపు తెలంగాణ 10 పరీక్షలపై కూడా కరోనా ప్రభావం పడింది. తెలంగాణ హై కోర్టు మార్చి 23 నుంచి జరగాల్సిన 10 పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read : స్వీయ నిర్భంధంలో విరాట్‌కోహ్లీ, అనుష్కశర్మ

కరీంనగర్ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో సీఎం కేసీఆర్ శనివారం కరీంనగర్ లో పర్యటించి..అక్కడ కరోనా వ్యాప్తి నివారణ కోసం తీసుకున్న చర్యలను పర్యవేక్షించనున్నారు.

యూరప్ దేశాల్లో కరోనా బాధితుల సంఖ్య ఇప్పటికే లక్ష దాటగా..ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 10,000 మించిపోయింది. కరోనా ప్రభావంతో శుక్రవారం నుంచి సోమవారం వరకూ కర్ఫ్యూ విధిస్తున్నట్లు శ్రీలంక ప్రధాని రాజపక్సే కార్యాలయం వెల్లడించింది. శ్రీలంకలో ఇప్పటి వరకూ 66 కరోనా కేసులు నమోదయ్యాయి.

Also Read : దేశ చరిత్రలోనే ఇలా ఉరితీయడం తొలిసారి..

మహారాష్ర్ట కూడా కరోనా నేపథ్యంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొంటుంది. అన్ని రాష్ర్టాలకన్నా ముందుగా విద్యాసంస్థలతో పాటు ఇతర సంస్థలు మూతపడింది మహారాష్ర్టలోనే. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా ఇతర నగరాల్లోనూ 31వ తేదీ వరకూ అన్ని దుకాణాలను మూసివేయాల్సిందిగా ఆదేశించింది అక్కడి ప్రభుత్వం. ఇందులో నిత్యావసర వస్తువులమ్మే దుకాణాలకు మాత్రం మినహాయింపు ఉంది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటికి రాకూడదని సూచించింది ప్రభుత్వం.

కేంద్రపాలిత ప్రాంతమైన లద్ధాక్ లోనూ కరోనా పంజా విసిరింది. ఇప్పటివరకూ ఈ ప్రాంతంలో 10 కరోనా కేసులు నమోదవ్వడంతో..వైరస్ ను కట్టడి చేసేందుకై ఏప్రిల్ 15వ తేదీ వరకూ ప్రభుత్వ పాలనా కార్యాలయాలను మూసివేయాల్సిందిగా ఆదేశాలొచ్చాయి. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే 15 సూచనలు చేసిన కేంద్రం..తాజాగా వాట్సాప్ హెల్ప్ డెస్క్ నెంబర్ ను ఏర్పాటు చేసింది. ఎవరికైనా కరోనా గురించిన అనుమానాలు ఉన్నా, పూర్తి సమాచారం తెలుసుకోవాలన్నా ఈ నెంబర్ కు వాట్సాప్ ద్వారా మెసేజ్ లు పంపించవచ్చని తెలిపింది.

Coronavirus Central Government Whatsapp Help Line Desk

Next Story