మధ్యతరగతి సొంతింటికల సాకారానికి కొత్త పథకం: ప్రధాని
మధ్యతరగతి వారి సొంతింటికలను సాకారం చేసేందుకు త్వరలో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
By Srikanth Gundamalla
మధ్యతరగతి సొంతింటి కల సాకారానికి కొత్త పథకం: ప్రధాని
ఢిల్లీలో ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. మధ్యతరగతి వారి సొంతింటికలను సాకారం చేసేందుకు త్వరలో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై మువ్వెన్నెల పతాకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆ తర్వాత దేశ ప్రజలకు వరాలజల్లు కురిపించారు. పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్యతరగతి ప్రజల సొంతింటికల సాకారం కోసం కృషి చేస్తున్నామని.. త్వరలోనే కొత్త పథకాన్ని కూడా తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చేలా కొత్త పథకం ఉంటుందని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ. దీని ద్వారా లబ్ధిదారులకు లక్షల రూపాయల్లో ప్రయోజనం చేకూరుతుందని.. త్వరలోనే మొదలుకానుందని తీపి కబురు చెప్పారు.
అంతేకాదు.. విశ్వకర్మ జయంతి పురస్కరించుకుని సంప్రదాయ కళాకారులకు చేయూతనందిస్తామని చెప్పారు మోదీ. విశ్వకర్మ యోజన పేరుతో కొత్త పథకం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ పథకాన్ని సెప్టెంబర్ నెల నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. తొలి విడతగా రూ.13వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల వరకు ఖర్చు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. చౌకధరల్లో లభించే జనరిక్ మందులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా జన ఔషధి కేంద్రాల సంఖ్యను 10వేల నుంచి 25వేలకు పెంచుతున్నట్లు మోదీ తెలిపారు. మార్కెట్‌లో రూ.100కు దొరికే మందులు.. ఈ జన ఔషధి కేంద్రాల్లో రూ.10 నుంచి రూ.15కే లభిస్తాయని మోదీ తెలిపారు.
తాను ప్రజల మధ్య నుంచే వచ్చానని.. ప్రజల గురించే ఆలోచిస్తా అని.. దేశ ప్రజలే తన కుటుంబం అని ప్రధాని మోదీ అన్నారు. మా పనితీరు చూసే మరోసారి 2019 ఎన్నికల్లో గెలిపించారని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిషలు కృషిచేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే.. వచ్చేఏడాది ఆగస్టు 15న మళ్లీ వస్తా.. ఎర్రకోట నుంచి మన దేశ విజయాలను చాటి చెప్తాను అని ప్రధాని మోదీ అన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే భారత్ ఐదో ఆర్థికశక్తిగా ఉందని.. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించబోతుందని గ్యారెంటీ ఇచ్చారు ప్రధాని. ఇక దేశంలో పలుచోట్ల ఊహించని విధంగా ప్రకృతి విపత్తులు సంభవించాయని.. భారీ వర్షాలు అతలాకుతలం చేశాయని అన్నారు. విపత్తుల కారణంగా నష్టపోయిన వారందరికీ ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలిపారు.