ప్రధానితో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొననున్న పచ్చడి పంపిన మహిళ

పంద్రాగస్టు వేడుకలకు ఢిల్లీ వేదికగా భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.

By Srikanth Gundamalla  Published on  14 Aug 2023 10:39 AM IST
independence day, Delhi, celebration, PM,

ప్రధానితో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొననున్న పచ్చడి పంపిన మహిళ 

రేపు భారతీయులంతా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కువగా ఈ వేడుకల్లో ప్రముఖులకే ప్రాధాన్యత ఉంటుంది. కానీ.. ప్రధాని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకూ వేడుకల్లో పాల్గొనాలని ఆలోచన చేశారు. దాంతో.. ప్రారంభమైన 'జన్ భాగియాదారి' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొత్తం 1700 మంది సామాన్య పౌరులను ఢిల్లీలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.

ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న వారిలో పీఎం కిసాన్, పీఎం కౌశల్ వికాస్ యోజన లబ్ధిదారులు 50 మంది ఉన్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్ పీవో)లకు చెందిన 250 మంది ప్రతినిధులు, వైబ్రాంట్ విలేజ్ స్కీంలో ఎంపికైన 400కు పైగా గ్రామాల సర్పంచ్​లు, సెంట్రల్ విస్టా, కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో పాల్గొన్న 50 మంది, బార్డర్ రోడ్ల నిర్మాణంలో పాల్గొన్న 50 మంది కార్మికులు, 50 మంది చొప్పున ప్రైమరీ స్కూల్ టీచర్లు, నర్సులు, మత్స్యకారులు, తదితరులు ఉన్నారు. కాగా.. ఒకరు మాత్రం ఆకర్షణగా మారారు. ఆమె ప్రధానికి ఆపిల్‌ పళ్ళ పచ్చడి పంపిన సునీత రౌతేలా.

సునీత రౌతేలా ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాకు చెందిన మహిళ. తన భర్త భరత్‌ సింగ్‌ రౌతేలాతో కలిసి పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొననున్నారు. భరత్ సింగ్ ఫార్మర్ ప్రొడ్యసర్ ఆర్గనైజేషన్ లబ్ధిదారుడు. ఇటీవల ఈ సంస్థ తయారు చేసిన ఆపిల్ పళ్ల చట్నీని భరత్‌ సింగ్ భార్య ప్రధానికి పంపించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ప్రధాని కార్యాలయం నుంచి ఆమెకు ఊహించని ఆహ్వానం అందింది. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం పంపించారు. అంతేకాదు.. ఆహ్వాన పత్రికలో ఆపిల్‌ పచ్చళ్ల ప్రస్తావన కూడా ఉంది. ప్రధానితో కలిసి పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని భరత్ సింగ్ తెలిపాడు.

పంద్రాగస్టు సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా అకౌంట్లకు త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రధాని కూడా తన సోషల్ మీడియా అకౌంట్ల డీపీల్లో జెండా ఫొటోలను ఉంచారు. పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ఢిల్లీలో ఆగస్ట్ 20వ తేదీ వరకూ మైగవర్నమెంట్ పోర్టల్ లో సెల్ఫీ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. దీని కోసం ఢిల్లీలో 12 చోట్ల సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. కాంటెస్ట్‌లో పాల్గొని సెల్ఫీ పాయింట్ల వద్ద సెల్ఫీలు దిగి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఒక్కో పాయింట్‌ నుంచి ఒక్కరు చొప్పున 12 మందిని ఎంపిక చేసి రూ.10వేల చొప్పున క్యాష్‌ ప్రైజ్ అందించనున్నారు అధికారులు.

Next Story