రెడ్‌ అలర్ట్‌: అల్పపీడన ప్రాంతం మళ్లీ వాయుగుండం

By సుభాష్  Published on  15 Oct 2020 3:14 AM GMT
రెడ్‌ అలర్ట్‌: అల్పపీడన ప్రాంతం మళ్లీ వాయుగుండం

వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ఏపీ-కర్ణాటక, మహారాష్ట్ర – తెలంగాణపై కొనసాగుతున్నవాయుగుండం భూ భాగంపైకి వచ్చినా బలహీనపడకుండా స్థిరంగా కొనసాగుతోంది. నిన్న వాయుగుండం కర్ణాటకలోని గుల్బర్గాకు 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై పశ్చిమ వాయువ్యదిశగా 25 కిలోమీటర్ల వేగంతో కదిలిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. క్రమంగా బలహీనపడి అల్పపీడన ప్రాంతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేసింది. అయితే ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆరేబియా సముద్రంపైకి వెళ్లనున్నట్లు భావిస్తోంది.

మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముంబై, థాణేతో సహా మొత్తం ఉత్తర కొంకణ్‌ ప్రాంతానికి రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. దక్షిణ మధ్య మహారాష్ట్రలో బుధవారం సాయంత్రం అల్పపీడనం బలహీనపడినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా అతలాకుతలం అవుతోంది. మూడు రోజుల పాటు నగర ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

16నాటికి ఆరేబియా సముద్రంలోకి వెళ్లిన అనంతరం .. అల్పపీడన ప్రాంతం మళ్లీ వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ఈశాన్య దిశగా కదులుతూ మహారాష్ట్ర-గుజరాత్‌కు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని షోలాపూర్‌, విదర్బ, మరట్వాడా ప్రాంతాల్లో అతి నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ప్రస్తుతం వాయుగుండం ప్రభావంతో 15 నుంచి మధ్య మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Next Story
Share it