ఐడియానే కొంపముంచింది: స్కూటీపై అక్రమంగా మద్యం సరఫరా..చివరకు ఏమైందంటే..
By సుభాష్ Published on 3 May 2020 9:12 AM GMTదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ మద్యం షాపులన్నీ మూతపడ్డాయి. దీంతో మద్యం ప్రియులు నానా అవస్థలకు గురవుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు అక్రమార్కులు అక్రమ మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముతూ అడ్డదారులు తొక్కుతున్నారు. బ్లాక్‌లో మద్యాన్ని అమ్ముకుంటు సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్కులు ఎన్ని ఎత్తులు వేస్తూ బ్లాక్ దందా కొనసాగిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు.
ఇక తాజాగా బెజవాడలో లాక్‌డౌన్ ముసుగులో లిక్కర్ మాఫియా అగడాలు ఏ మాత్రం ఆగడం లేదు. అక్రమ మార్గంలో మందు, బీర్లు ఎక్కువ రేట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి బైక్‌కు బ్యాంకులో పని చేస్తున్నట్లు స్టిక్కర్ అతికించుకుని బీర్లను అక్రమంగా సరఫరా చేస్తున్నాడు. ఏదో విధంగా పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయడంలో అసలు విషయం బయటపడింది. బైక్‌లో ఓ సంచిలో బీర్లను పెట్టుకుని బ్లాక్ దందా కొనసాగిస్తున్నాడు. సదరు వ్యక్తి గవర్నర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు, అత్యవసర సేవలకు అనుమతి ఇచ్చింది. దీంతో బ్యాంకులలో పని చేసేవారికి లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చింది. వారు వెళ్లి బ్యాంకుల్లో విధులు నిర్వహించుకోవచ్చు. అలాంటి వారి బైక్‌లను పోలీసులు ఆపడం లేదు. సదరు వ్యక్తి కూడా స్కూటీకి బ్యాంకు లో పని చేస్తున్నట్లు స్టిక్కర్ అతికించుకుంటే పోలీసులెవ్వరు ఆపరనే ఉద్దేశంతో స్టిక్కర్‌ను స్కూటీ ముందు అతికించుకుని ఎంచక్క మద్యం దందా చేస్తున్నాడు. చివరకు పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయడంలో భారీగా బీర్ల బాటిళ్లు బయటపడ్డాయి.