గ్రామస్థులకు కరోనా సోకకుండా పోరాడుతున్న మునాఫ్ పటేల్
By తోట వంశీ కుమార్ Published on 22 July 2020 2:47 PM GMT2011 వరల్డ్ కప్ జట్టులో మునాఫ్ పటేల్ సభ్యుడు. తన పేస్ బౌలింగ్ తో భారత్ కు మంచి విజయాలు అందించాడు. 144 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగలిగే మునాఫ్ పటేల్ కు 'ఇఖర్ ఎక్స్ ప్రెస్' అనే పేరు ఉంది. ఆ పేరు రావడానికి ముఖ్య కారణం అతడిది గుజరాత్ రాష్ట్రం లోని భరూచ్ జిల్లా లోని ఇఖర్ గ్రామం కావడమే..! ఇఖర్ గ్రామం బాగు కోసం ఎప్పుడూ మునాఫ్ పటేల్ ప్రయత్నిస్తూ ఉంటాడు. కరోనా మహమ్మారి సమయంలో మునాఫ్ తన గ్రామస్థుల పద్ధతిలో చాలా మార్పులు తీసుకుని వచ్చాడు. గ్రామం మొత్తం కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఇఖర్.. 8000 మంది జనాభా ఉన్న గ్రామం. లాక్ డౌన్ సమయానికి మునాఫ్ పటేల్ కూడా సొంత గ్రామంలో ఉన్నాడు. ప్రజలలో చాలా మందికి కరోనా అంటే ఏమిటి.. సామాజిక దూరం పాటించడం, మాస్కుల వల్ల ప్రయోజనం వంటివి తెలియకపోవడాన్ని గమనించాడు. ఏప్రిల్ నెల రెండో వారం లోనే ఇఖర్ గ్రామంలో 5 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇలాగే ప్రబలితే ప్రజలందరికీ ఇబ్బందులు తప్పవని మునాఫ్ భావించాడు.
ఆ తాలూకాలో ఇఖర్ గ్రామంలో మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు రావడంతో అధికారులు కంటామినెంట్ జోన్ గా ప్రకటించారు. కానీ గ్రామస్థుల్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. దీంతో 38 సంవత్సరాల మునాఫ్ పటేల్ గ్రామస్థుల్లో మార్పు తీసుకుని రావాలని భావించాడు. ఇక గ్రామంలో కరోనా కేసులు రాకూడదని తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
'లాక్ డౌన్ అమలు చేసినప్పుడు ఇఖర్ గ్రామస్థులకు కరోనా వైరస్ గురించి పెద్ద అవగాహన లేదు.. అయిదుగురు గ్రామస్థులు తమిళనాడు నుండి ఇఖర్ కు చేరుకున్నారు. వారికి కరోనా వైరస్ సోకింది అని తెలియగానే గ్రామంలో ఎంతో భయానక వాతావరణం ఏర్పడింది' అని మునాఫ్ చెప్పుకొచ్చాడు. గ్రామస్థులకు సామాజిక దూరం పాటించడమంటే తమను ఎవరో కావాలనే దూరం ఉంచుతున్నారు అని అనుకునే వారు.. దీంతో నేను కరోనా వైరస్ గురించి వారికి చెప్పడం మొదలుపెట్టాను.. అలాగే మాస్కులు వాడడం గురించి తెలియజేశాను. ఏప్రిల్ నెలలో గ్రామస్థులు పొలం పనులలో బిజీగా ఉంటారు.. అలాంటి సమయంలో వారికి లాక్ డౌన్ గురించి చెప్పి.. సముదాయించడం చాలా కష్టమైందన్నాడు మునాఫ్. అందరూ గుంపులుగా తిరిగితే వచ్చే ప్రమాదం ఏమిటో తెలియజేసేలా చర్యలు తీసుకోవడమే కాకుండా.. లాక్ డౌన్ లో ఉన్న గ్రామంలో రైతులు పొలాల్లోకి వెళ్లేలా అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాడు మునాఫ్.
మునాఫ్ చేసిన మంచి పనులను స్థానిక అధికారులు, వైద్యాధికారులు ప్రశంసించారు. రైతులు సామాజిక దూరం పాటిస్తూ పొలం పనులు చేసుకునేలా చేసింది మునాఫ్ అని.. పోలీసులను, హెల్త్ ఆఫీసర్లను కలిసి మాట్లాడింది అతడేనని ఇఖర్ సర్పంచ్ హరూన్ హైంది తెలిపారు. లాక్ డౌన్ సమయంలో మునాఫ్ ప్రతిరోజూ పంచాయతీ ఆఫీసును సందర్శించేవాడు. కొన్ని గంటల పాటూ అక్కడే ఉంటూ గ్రామంలో కరోనా ప్రబలకుండా ఉండేదుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేవాడు. గ్రామస్థులు కూడా మునాఫ్ చెప్పిన విషయాలను పాటించడంతో గ్రామంలో కరోనా ప్రబలకుండా చేశామని అన్నారు హరూన్. స్థానికుల్లో ఎవరికైనా జ్వరం లాంటివి వస్తే టెస్టులు చేయించుకోడానికి ముందుకు వస్తున్నారంటే అందుకు కారణం మునాఫ్ పటేల్ చెప్పిన మాటలే కారణమని ఇఖర్ హెల్త్ సెంటర్ లో పనిచేసే వారు తెలిపారు. ఏది ఏమైనా మునాఫ్ చేసిన పని వలన ఇఖర్ గ్రామస్థుల్లో ఎంతో మార్పు వచ్చింది.