ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ విస్తరిస్తోంది. నిన్నమొన్నటి వరకు అదుపులోనే ఉందనుకున్న వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఢిల్లిలో తుబ్లిగ్‌ – ఎ – జమాత్‌ అనే సంస్థ నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న వారిలో అనేక మందికి కరోనా వైరస్‌ సోకడంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఇదిలాఉంటే ఢిల్లిలో 120 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో అనేక మంది మత సంస్థ జరిపిన సమావేశంలో పాల్గొన్న వారే ఉన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఢిల్లి సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ఢిల్లిలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇదే సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న వారికి చికిత్స అందించే క్రమంలో వైద్యులు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు రూ. కోటి ఆర్థిక సాయం అందిస్తామని కేజ్రీవాల్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ పోరులో వారి సేవలు సైనికుల కంటే తక్కువేం కాదని కేజ్రీవాల్‌ అభిప్రాయ పడ్డారు. చికిత్స అందిస్తూ మరణించిన వారు ప్రభుత్వం రంగ సిబ్బందా.. ప్రైవేట్‌ రంగం సిబ్బందా అనేది సంబంధం లేకుండా వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్