మహిళాదినోత్సవం.. పుట్టిన రోజు.. కప్పు అందించేనా..?

యావత్ భారత దేశం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తుంది. మెల్‌బోర్న్ వేదికగా రేపు ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు అతిథ్య ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలిసారి ఫైనల్ చేరిన టీమ్‌ఇండియా.. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆసీస్‌ను ఓడించి కప్ గెలవగలదా..?
మహిళా దినోత్సవం రోజున ప్రపంచకప్‌కు గెలిచి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని హర్మన్ సేన ఉవ్విళ్లూరుతుంది. కాగా సొంత ప్రేక్షకుల మధ్య ఐదోసారి ప్రపంచ కప్ అందుకోవాలని ఆసీస్ భావిస్తోంది. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం టీమ్‌ఇండియాకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేదే. అయితే ఫైనల్‌లో ప్రత్యర్థి జట్లను బోల్తా కొట్టించి కప్పు గెలవడం కంగారూలను వెన్నతో పెట్టిన విద్య. కాగా వరుసగా ఐదు సార్లు ఫైనల్ చేరి నాలుగు సార్లు కప్పు కొట్టిన ఆస్ట్రేలియా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.
భారత జట్టు ఆశలన్ని యువసంచలనం షెఫాలీ వర్మపైనే ఉన్నాయి. టోర్నీ ఆరంభం నుంచి విధ్వంసక ఇన్నింగ్స్‌లతో జట్టుకు శుభారంభాలను ఇస్తోంది. ఫైనల్‌లోనే షెఫాలీ దూకుడు కొనసాగిస్తే మ్యాచ్ పై భారత్‌కు పట్టు చిక్కినట్లే. మరోఓపెనర్ స్మృతి మంథాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జెమియా రోడిగ్స్ ఇప్పటి వరకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఫైనల్‌లో వీరందరూ సమిష్టిగా రాణించాల్సి ఉంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత జట్టు స్కోర్ 150 పరుగులు కూడా దాటలేదు. అయినప్పటికి భారత బౌటర్లు చక్కగా రాణిస్తున్నారు. స్వల్ప లక్ష్యాలను కాపాడుకుంటూ జట్టును విజయాలను అందిస్తున్నారు.
గాయాలతో ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ, పేసర్ తాల్యా వ్లామ్నిక్ జట్టుకు దూరమవ్వడం ఆసీస్‌కు ఎదురుదెబ్బే. కానీ, కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని జయించే అలవాటు ఆసీస్ సొంతం. ఇటీవల జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో భారత్‌పై విజయం సాధించింది. అయితే ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌సేన చేతిలో ఓటమి చవిచూడటం ఆసీస్‌ను ఆందోళన పెట్టించే విషయం. కానీ, ఆ తర్వాత గొప్పగా పుంజుకొని టోర్నీలో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరింది. తుది పోరులో విజయం సాధించాలంటే సారథి మెగ్ లానింగ్, బెత్ మూనీ, ఎలీసా హీలీ రాణించాలి.
భారత్ జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (సారథి), షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, తానియా భాటియా, హర్లీన్ డియోల్, రాజేశ్వరి గైక్వాడ్, రీచా ఘోశ్, వేద కృష్ణమూర్తి, శిఖ పాండే, అరుంధతి రెడ్డి, పూజ వస్త్రాకర్, పూనమ్, రాధా యాదవ్.
ఆస్ట్రేలియా జట్టు : మెగ్ లానింగ్ (సారథి),ఎరిన్ బర్న్స్, నికోలా కేరీ, ఆష్లీ గాడ్నర్, రేచల్ హేన్స్, అలిసా హీలీ, జెస్ జొనాసెన్, డెలిసా కిమ్మిన్స్, సోఫీ మొలినెక్స్, బెత్ మూనీ, ఎలిస్ పెర్రీ, మెగాన్ స్కట్, అనాబెల్ సదర్లాండ్, తాల్యా వ్లామ్నిక్, జార్జియా హరెహామ్.