గాయం నుంచి కోలుకున్న టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాం ప్రస్తుతం మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. డీవై పాటిల్‌ టి20 క్రికెట్‌ కప్‌లో మూడు రోజుల వ్యవధిలో రెండు శతకాలు బాదాడు. మంగళవారం 10 సిక్సర్లు, 7 బౌండరీలు బాది 39 బంతుల్లో 105 పరుగులు చేసిన ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌.. శుక్రవారం బీపీసీఎల్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో తన విశ్వరూపం చూపించాడు. రిలయన్స్‌-1 జట్టు తరుపున బరిలోకి దిగి కేవలం 55 బంతుల్లోనే 20 సిక్స్‌లు, 6 ఫోర్లతో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న శ్రేయాస్‌ అయ్యర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. పాండ్యా విధ్వంసంతో రిలయన్స్‌ వన్‌ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 238 పరుగులు సాధించింది. అనంతరం ఛేదనలో బీపీసీఎల్‌ 134 పరుగులకే ఆలౌటై… 104 పరుగుల భారీ తేడాతో ఓడింది.

ఇదిలా ఉండగా నిన్నటి మ్యాచ్‌ తరువాత.. పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌ సంగతి తెలుసుకున్న అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. మొత్తం స్టేడియం అంతా పాండ్యా నామస్మరణంలో మార్మోగింది. వేల సంఖ్యలో అభిమానులు హార్ధిక్‌.. హార్ధిక్‌ అంటూ నినాదానలతో స్టేడియాన్ని హోరెత్తించారు. కొంతమంది ఫ్యాన్స్‌ అయితే ఏకంగా.. రిలయన్స్‌-1 డ్రెస్సింగ్‌ రూమ్‌కు వద్దకు వెళ్లి మరీ హార్దిక్‌ నామస్మరణ చేశారు. ప్రస్తుతం దీనికి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మ్యాచ్‌ అనంతరం హార్ధిక్‌ మాట్లాడుతూ.. తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి ఇదొక మంచి ప్లాట్‌ఫామని చెప్పారు. గాయం నుంచి కోలుకున్న తన శరీరం ప్రస్తుతం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికి ఇది ఒక మంచి సువర్ణావకాశమన్నాడు. ఎలా ఆడాలని అనుకున్నానో అలా ఆడుతుండడంతో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఇక తన విధ్వంసక ఇన్నింగ్స్‌ల గురించి చెబుతూ.. పరిస్థితులను బట్టి ఆడానని, ముందస్తు ప్రణాళిక అంటూ ఏమీ లేదన్నాడు.

గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌ తరఫున చివరి మ్యాచ్‌ ఆడిన పాండ్యా ఆ తర్వాత వెన్నుగాయంతో జట్టుకు దూరమయ్యాడు. వెన్నుగాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత పాండ్యా సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్నాడు. తాజాగా డీవై కప్‌లో బరిలోకి దిగి తన ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.