ఐసీసీ వ‌న్డే సూపర్ లీగ్.. 13 దేశాలు.. 156 మ్యాచ్‌లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 July 2020 11:14 AM GMT
ఐసీసీ వ‌న్డే సూపర్ లీగ్.. 13 దేశాలు.. 156 మ్యాచ్‌లు

భారత్‌ వేదికగా 2023లో జ‌ర‌గ‌నున్న‌ వన్డే ప్రపంచకప్ అర్హ‌త‌ కోసం ఐసీసీ వ‌న్డే సూపర్ లీగ్‌ను ప్ర‌క‌టించింది. ఈ నెల 30న సౌతాంప్ట‌న్ వేదిక‌గా ఇంగ్లండ్-ఐర్గాండ్ మధ్య మొదలయ్యే మూడు వన్డేల సిరీస్​తో ఈ లీగ్ ప్రారంభం కానుందని ఐసీసీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే లీగ్‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించాల్సివుంది. ఇక 2023 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం కలిగిన ఆతిథ్య భారత్‌తో కలుపుకుని.. ఎనిమిది దేశాలు ఆటోమేటిక్‌గా ఆ టోర్నీకి అర్హత సాధిస్తుండగా.. 12 ఐసీసీ సభ్యదేశాలతో పాటు నెదర్లాండ్‌తో క‌లిపి మొత్తం 13 జట్లు ఈ సూపర్​ లీగ్​లో పోటీ పడనున్నాయి.



ఈ లీగ్​లో భాగంగా ప్రతి జట్టు స్వదేశంలో నాలుగు, విదేశాల్లో మూడు వన్డే సిరీస్​లు ఆడనున్న‌ట్లు ఐసీసీ పేర్కొంది. ఎనిమిది జట్లు ప్రపంచకప్​నకు నేరుగా అర్హత సాధిస్తే.. మిగిలిన ఐదు జట్లు.. ఐదు అసోసియేట్ జట్లతో 2023 క్వాలిఫయర్స్​లో తలపడాతాయి. మొత్తంగా 2023 ప్రపంచకప్​లో 10 జట్లు పోటీలో ఉంటాయి. సూపర్​ లీగ్​లో మ్యాచ్​ గెలిచిన ఒక్కో జట్టుకు 10పాయింట్లు దక్కుతాయి. మ్యాచ్ రద్దయినా, టై అయినా ఇరు జట్ల ఖాతాలో ఐదేసి పాయింట్లు చేరుతాయి. ఇదిలావుంటే.. ఈ వ‌న్డే సూప‌ర్‌ లీగ్‌ను మే నెలలోనే నిర్వహించాల్సి ఉండగా.. కరోనాతో ఆలస్యమైంది.

ఈ కొత్త సూపర్ లీగ్‌ సిరీస్‌కు ఎటువంటి ఆటంకాలు లేకుండా.. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించడానికి ఆయా బోర్డులతో కలిసి ఐసీసీ నడుంబిగించింది. అయితే.. 2023 వరల్డ్‌కప్‌కు ఇంకా చాలా సమయం ఉండటంతో అర్హత ప్రక్రియకు ఎటువంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌బోవ‌ని ఐసీసీ భావిస్తోంది.

2019 ఇంగ్లండ్‌లో జరిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ముందు నిర్వహించిన క్వాలిఫైయింగ్ విధానాన్నే.. 2023 ప్ర‌పంచ‌క‌ప్‌ అర్హత ప్రక్రియకు అవ‌లంబిస్తున్నారు. 13 దేశాలు పాల్గొనే ఈ లీగ్‌లో మొత్తం 156 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 2022 చివరి వరకూ సూపర్‌ లీగ్ జ‌రుగ‌నుంది. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం.. 2023 వరల్డ్‌కప్‌ను ఫిబ్రవరిలో నిర్వహించాల్సి ఉండగా, తాజా షెడ్యూల్‌లో మార్పుల వల్ల ఆ మెగా టోర్నీని ఆ ఏడాది అక్టోబర్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Next Story