ట్వీట్ గోతిలో పడ్డ ఐపీఎస్‌ అధికారి

By రాణి  Published on  20 Dec 2019 7:45 AM GMT
ట్వీట్ గోతిలో పడ్డ ఐపీఎస్‌ అధికారి

నటుడు ఫర్హాన్ అఖ్తర్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముంబైలోని ఆగస్టు క్రాంతి మైదానానికి ప్రజలను రమ్మని ఆహ్వానిస్తూ చేసిన ట్వీట్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేసిన సందీప్ మిత్తల్ అనే ఐపీఎస్‌ అధికారి ట్రోలింగ్ ఊబిలో ఇరుక్కుపోయారు. ఆయన పార్లమెంట్లో జాయింట్ సెక్రటరీ. అఖ్తర్ ట్వీట్ ఐపీసీ సెక్షన్ 121 ప్రకారం శిక్షార్హమని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో వామపక్ష, లిబరల్ గ్రూపులు ఆయనపై ట్రోల్స్ వాన కురిపించి ముంచెత్తాయి.



అంతకు ముందు రోజు ఆయన ప్రముఖ సినీ రచయిత జావేద్ అఖ్తర్ చేసిన ఒక ట్వీట్ ను కూడా వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. అప్పుడు కూడా లిబరల్స్ ఆయనను టార్గెట్ చేశారు. అయితే ఆయనను అభినందించిన వారు కూడా లేకపోలేదు. కానీ గురువారం నాటికి ఆయనపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడం జరిగింది. అంతలో ఆయన పై ట్విట్టర్ లో ఆయన గతంలో పోర్న్ వీడియోలను లైక్ చేశారని విమర్శలు వెల్లువెత్తాయి.



దాంతో ఆయన హఠాత్తుగా అలర్ట్ అయ్యారు. తన ట్విట్టర్ హ్యాండిల్ ను ఎవరో పాక్షికంగా హ్యాక్ చేశారని, అయినా తాను ఇలాంటి శక్తులకు తలొగ్గేది లేదని ఆయన మరో ట్వీట్ ద్వారా తెలియచేశారు. కానీ ఆధార్ డేలా లీక్ పై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ట్విట్టర్ ఖాతాదారు రాబర్ట్ బాప్తిస్ట్ అలియాస్ ఎలియట్ ఆల్డర్ సన్ ఆయన చెబుతున్నది అబద్ధమని, గతంలోనూ ఆయన పోర్న్ వీడియోలను లైక్ చేశారని వాదించాడు. ఆయనతో గొంతు కలిపి చాలా మంది ట్విట్టర్ ఖాతాను పాక్షికంగా హ్యాక్ చేయడం అసాధ్యమని వాదించారు. దీంతో సదరు జాయింట్ సెక్రటరీ గారు సైలెంట్ అయిపోయారు.



Next Story