అయోధ్యపై 'సుప్రీం'లో హైడ్రామా..!

By Medi Samrat  Published on  16 Oct 2019 9:34 AM GMT
అయోధ్యపై సుప్రీంలో హైడ్రామా..!

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ చివరి రోజు హైడ్రామా నెలకొంది. ఉదయం నుంచే కోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన వాదనకు మద్దతుగా హిందూ మహాసభ న్యాయవాది న్యాయస్ధానంలో చూపించిన పుస్తకంపై వివాదం నెలకొంది. 'అయోధ్య రీవిజిటెడ్' పేరుతో మాజీ ఐపీఎస్ అధికారి కిశోర్ రాసిన పుస్తకాన్ని హిందూ మహాసభ న్యాయవాది వికాస్ సింగ్‌ కోర్టు ముందుంచారు. ఈ పుస్తకాన్ని ముస్లిం సంస్థల తరపు న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ చించివేయడంతో గందరగోళం ఏర్పడింది.

1986లో ముద్రించిన ఈ పుస్తకాన్ని రికార్డుల్లోకి తీసుకోవద్దంటూ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే పుస్తకాన్ని, మ్యాప్‌ను చింపిన సున్నీ వక్ఫ్ బోర్డ్ తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అసహనం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కోర్టు నుంచి వెళ్లిపోతామని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. ఓ దశలో న్యాయవాదులకు, ప్రధాన న్యాయమూర్తి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు అయోధ్య వివాదంపై నేడు వాదనలు ముగియనుండటంతో సుప్రీం కోర్టు వెల్లడించే తుదితీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

వాదనలు పూర్తి... తీర్పు రిజర్వ్

రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు 40 రోజుల పాటు సాగించిన రోజువారీ విచారణ తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నవంబర్ 17వ తేదీకి ముందే తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ కేసులో సంబంధిత పార్టీలు లిఖిత పూర్వక నివేదనలు అందజేసేందుకు సుప్రీం ధర్మాసనం మరో మూడు రోజుల గడువు ఇచ్చింది.

'విచారణ ముగింపు దశకు వచ్చింది. ఇప్పటి వరకూ జరిగింది చాలు' అని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి సారధ్యం వహిస్తున్న రంజన్ గొగోయ్ అన్నారు. అయితే, ఆయన చెప్పిన గడువు కంటే గంట ముందుగానే మధ్యాహ్నం 4 గంటలకు విచారణ ముగిసింది. ఈ కేసులో ఇవాల్టితో 40 రోజుల పాటు రోజవారీ విచారణను ధర్మాసనం చేపట్టింది. నవంబర్ 17న సీజేఐ పదవీ విరమణ చేయనుండటంతో ఆలోపే ఆయన తీర్పు వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Next Story