మెట్రో గోడలపై 'క్యారే మియా.. కైసే హో మియా.. బిస్కుటా ఖాతే క్యా'   

By సుభాష్  Published on  2 March 2020 3:12 PM GMT
మెట్రో గోడలపై క్యారే మియా.. కైసే హో మియా.. బిస్కుటా ఖాతే క్యా   

హైదరాబాదీ.. ఈ భాషలో ఉండే కిక్కు స్టయిలే వేరప్పా అంటారు. హైదరాబాద్ లో జీవనం సాగించే వారంతా దాదాపుగా అలవాటు పడిపోతారు. ఎక్కడెక్కడి నుండే వచ్చి 'హైదరాబాదీ' గా మారినోళ్లు చాలా మందే..! తెలంగాణ లోని ఇతర ప్రాంతాల నుండి వచ్చినోళ్లే కాదు.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాళ్ళు కూడా హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు.. ఇతర రాష్ట్రాల వారు కూడా హ్యాపీగా సెటిల్ అవుతున్నారు కూడానూ..! విభిన్నమైన సంప్రదాయాలు.. భిన్నత్వంలో ఏకత్వం హైదరాబాద్ సొంతం. వీరందరినీ హైదరాబాదీ భాష కూడా ఏకం చేస్తుంది.

అందుకే ఇకపై మెట్రో సర్వీసుల్లో కూడా హైదరాబాదీ భాష కనిపించబోతోంది. మెట్రో రైలు ప్రయాణం ఎంజాయ్ చేయాలని అనుకుంటున్న వారికి హైదర్-అబాదీ భాషను వినిపించనున్నారు. హైదరాబాద్ కల్చర్ ఇంటరాక్షన్ గా మెట్రోలను వాడనున్నారు. సాధారణంగా హైదరాబాద్ లో క్యారే మియా, కైసే హైరే మియా, బస్సా, బిస్కుటా, కైకో, నక్కో, హౌ, కాలేజా, స్కూలాన్.. లాంటి పదాలను ఖచ్చితంగా వినే ఉంటారు. అదే హైదరాబాద్ కు కొత్తగా వచ్చిన వాళ్లకు ఇది తెలియజేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ భావిస్తోంది. హైదరాబాద్ కు కొత్తగా వచ్చిన వాళ్ళు కొన్ని కొన్ని పదాలు నేర్చుకుంటే ఈ నగరానికి అలవాటు పడడం పెద్ద కష్టం కాకపోవచ్చు అని మెట్రో రైల్ అధికారులు భావిస్తున్నారు.

'పక్కా హైదరాబాదీ' గోడలను మెట్రో స్టేషన్స్ లో ఉంచబోతున్నామని హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వి.ఎస్.రెడ్డి తెలిపారు. కొత్తగా వచ్చిన వాళ్లకు హైదరాబాద్ భాషను తెలియజేయడమే కాకుండా.. వారు ఈ నగరానికి అలవాటు పడడం కూడా చాలా సులువుగా మారుతుందని ఆయన అన్నారు. కల్చరల్ ఎక్స్ చేంజ్ విషయంలో కూడా బాగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కొన్ని పదాలు.. కొన్ని వ్యాఖ్యలు అక్కడ ఉంచనున్నారు.. వాటి అనువాదం కూడా అక్కడ ఉంచనున్నారు.. ముఖ్యంగా ఏయే సందర్భాల్లో వీటిని వాడాలో కూడా తెలియజేస్తారు.

మెట్రోను కేవలం ప్రయాణించడానికి మాత్రమే ఉపయోగించకుండా 'లైఫ్ ను సెలెబ్రేట్' చేసుకోడానికి వాడేలా చూడాలని ఆయన అన్నారు. మెట్రో స్టేషన్స్ లో గెట్-ఇన్, గెట్-అవుట్ ఏరియాల్లో ఈ వాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయంపై సలహాలు సూచనలు ఇవ్వాలని అనుకుంటున్న వాళ్ళు cprohmrl@gmail.com కు మెయిల్ చేయాలని సూచించారు. మొత్తం ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకో రెండు నెలలు పడుతుందని ఆయన అన్నారు.

హైదరాబాద్ అన్నిటికీ అనువుగానే ఉండడం.. ఇతర నగరాలతో పోలిస్తే కాలుష్యం, ట్రాఫిక్ కూడా చాలా తక్కువే..! అంతేకాదు కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయంలో కూడా హైదరాబాద్ చాలా తక్కువ అనే వారు కూడా ఉన్నారు. ఎంతో మంది తమ కలలను సాకారం చేసుకోడానికి హైదరాబాద్ నగరం లోకి అడుగుపెడుతూ ఉంటారు. ఎటువంటి వారినైనా హక్కున చేర్చుకునే నైజం హైదరాబాద్ సొంతం కాబట్టే.. ఎలాంటి వారైనా సులువుగా అలవాటు పడిపోతూ ఉంటారు.

Next Story