ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఊరట

YSRCP rebel MP gets breather in MLAs’ poaching case. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ కె. రఘురామకృష్ణంరాజుకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును

By అంజి  Published on  29 Nov 2022 11:53 AM IST
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఊరట

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ కె. రఘురామకృష్ణంరాజుకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) రెబల్‌ ఎంపీ మంగళవారం విచారణ బృందం ముందు హాజరుకావాల్సిన అవసరం లేదని సిట్‌ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజుకు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ గంగాధర్‌ మెయిల్‌ పంపారు. రఘురామ విచారణకు ఎప్పుడు రావాలో తర్వాత తెలియజేస్తామని చెప్పారు.

నరసాపురం నియోజకవర్గానికి చెందిన లోక్‌సభ సభ్యుడు రఘురామకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఎ కింద సిట్ గత వారం సిట్‌ నోటీసు జారీ చేసింది. నవంబర్ 29న హైదరాబాద్‌లోని సిట్ అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో నిందితులతో ఉన్న సంబంధాలపై ప్రశ్నించేందుకు విచారణ బృందం ఆయనకు సమన్లు ​​పంపినట్లు సమాచారం. సిట్‌ విచారణకు పిలిచిన ఏడో వ్యక్తి రఘురామ. ఈ కేసులో ఇప్పటి వరకు న్యాయవాదులు భూసారపు శ్రీనివాస్, ప్రతాప్ గౌడ్, ముగ్గురు నిందితుల్లో ఒకరైన నందకుమార్ భార్య చిత్రలేఖలు సిట్ ఎదుట హాజరయ్యారు.

బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, భరత్ ధర్మ జన సేన (బీడీజేఎస్) అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి, కేరళకు చెందిన డాక్టర్ జగ్గు స్వామి ఇంకా హాజరుకాలేదు. కేరళలో బీజేపీ మిత్రుడు తుషార్, జగ్గు స్వామి ఆచూకీ కనిపెట్టడంలో దర్యాప్తు బృందం విఫలమవడంతో సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. సంతోష్‌కు సిట్ నోటీసుపై తెలంగాణ హైకోర్టు గత వారం డిసెంబర్ 5 వరకు స్టే విధించింది.

టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు భారీగా డబ్బు ఎర చూపి పార్టీ ఫిరాయించేందుకు యత్నించిన రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, సింహయాజీ, నందకుమార్‌లను సైబరాబాద్ పోలీసులు అక్టోబర్ 26వ తేదీ రాత్రి హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో అరెస్టు చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో ఒకరైన పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులు తనకు రూ.100 కోట్లు, మరో ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. నిందితులపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ), అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Next Story