ప్రేయసికి పిజ్జా ఇవ్వడానికి వెళ్లి.. యువకుడు మృతి
ప్రేయసి పిజ్జా తినాలని ఉందంటూ అడిగింది. దాంతో.. ఆమెకోసం పిజ్జా తీసుకెళ్లిన యువకుడు.. బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయాడు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 11:01 AM ISTప్రేయసికి పిజ్జా ఇవ్వడానికి వెళ్లి.. యువకుడు మృతి
ప్రియురాలు పిజ్జా తినాలని ఉందంటూ అడిగింది. దాంతో.. ప్రియుడు ఆమె కోరిక తీర్చేందుకు స్వయంగా పీజ్జా తీసుకుని వెళ్లాడు. ఇంటికెళ్లాక సడెన్‌గా యువతి తండ్రి రావడంతో.. బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు యువకుడు. దాంతో తీవ్రగాయాలు అయ్యాయి. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియుడు ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్‌లోని బోరబండలో చోటుచేసుకుంది ఈ విషాద సంఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహ్మద్ షోయబ్ (19) అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ బేకరీలో పని చేస్తున్నాడు. షోయబ్‌కు అందే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అయితే.. పరిచయం కాస్త స్నేహంగా మారి రోజూ మాట్లాడుకునేవారు. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే యువతి గత ఆదివారం షోయబ్‌కు కాల్ చేసి పిజ్జా తినాలని ఉందని చెప్పింది. ప్రేయసి అలా అడిగేసరికి యువకుడు ఆమె కోరిక తీర్చాలని అనుకున్నాడు. తానే స్వయంగా ఒక పిజ్జాను కొనుగోలు చేసి ప్రేయసికి ఇచ్చేందుకు ఆమె ఇంటికి బయల్దేరాడు.
ఇక పిజ్జా తీసుకుని ప్రేయసి ఇంటికి చేరుకున్న షోయబ్ దాన్ని ఆమెకు ఇచ్చేందుకు బిల్డింగ్ ఎక్కాడు. కానీ.. అనుకోకుండా అదే సమయంలో యువతి తండ్రి వచ్చాడు. భయపడిపోయిన షోయబ్ ఎలాగైనా ఆయనకు కనిపించకుండా వెళ్లిపోవాలని అనుకున్నాడు. దొరికితే ఏం చేస్తారో అని భయపడిపోయాడు. దాంతో.. బిల్డింగ్ పైనుంచి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. దాంతో..నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకడంతో షోయబ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు షోయబ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో రెండ్రోజుల పాటు చికిత్స పొందిన షోయబ్ మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. దాంతో.. మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.