ఆటోలో 16 తులాల బంగారం మరిచిపోయిన మహిళ.. చివరకు..
ఓ మహిళ ఆటోలో ఎక్కింది. గమ్యస్థానం చేరుకున్నాక.. తనతో పాటు తెచ్చుకున్న బంగారం ఉన్న బ్యాగు ఆటోలోనే మర్చిపోయింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 5:15 PM ISTఆటోలో 16 తులాల బంగారం మరిచిపోయిన మహిళ.. చివరకు..
హైదరాబాద్‌లో జరిగింది ఈ సంఘటన. ఓ మహిళ ఆటోలో ఎక్కింది. గమ్యస్థానం చేరుకున్నాక.. తనతో పాటు తెచ్చుకున్న బంగారం ఉన్న బ్యాగు ఆటోలోనే మర్చిపోయింది. కాసేపటికే బంగారం మిస్ అయ్యిందని గ్రహించిన మహిళ.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
అంబర్‌పేట మారుతీ నగర్‌కు చెందిన మహిళ తన తల్లితో కలిసి ఆటోలో ఎంజీబీఎస్‌కు బయల్దేరింది. తమతో పాటు 16 తులాల బంగారాన్ని బ్యాగులో వేసుకుని ఆటోలో ఎక్కింది. ఆటోలో కూర్చుని ఉన్నంత సేపు బ్యాగుని పక్కకు పెట్టి కూర్చొంది మహిళ. ఇక గమ్యస్థానం రాగానే ఏదో మాట్లాడుతూ బ్యాగ్‌ను మర్చిపోయి ఆటో నుంచి దిగిపోయింది. ఇక డ్రైవర్ డబ్బులు తీసుకున్నాక అతడూ వెళ్లిపోయాడు. మహిళ అలా నాలుగు అడుగులు ముందుకు వేయగానే.. బంగారం గుర్తుకు వచ్చింది. వెంటనే కంగారుపడిపోయింది. మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఆటోలోనే బంగారం బ్యాగును మర్చిపోయానని పోలీసుల ముందు వాపోయింది. తన బ్యాగుని ఎలాగైనా వెనక్కి తెచ్చివ్వండి సారూ అంటూ వేడుకోలు చేసుకుంది.
ఇక మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగారు. మహిళ దిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ దృశ్యాలను పరిశీలించారు. ఆ విధంగా వీడియో ద్వారా ఆటోను గుర్తించారు. చివరకు ఆటో డ్రైవర్ నుంచి బంగారం మొత్తాన్ని రికవరీ చేశారు. అనంతరం బ్యాగుని బాధితురాలికి అప్పగించారు మీర్‌చౌక్ పోలీసులు. ఫిర్యాదు అందిన వెంటనే క్షణాల్లో స్పందించి.. బంగారాన్ని రికవరీ చేసిన పోలీసులకు సదురు మహిళ కృతజ్ఞతలు తెలిపింది. పోయిందనుకున్న బంగారం తిరిగి చేతికి చిక్కడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.