మూసీలో కొట్టుకొచ్చిన మృతదేహం, నాలాలో గల్లంతైన మహిళేనా?
మూసారాంబాగ్ మూసీ బ్రిడ్జి వద్ద ఒక మహిళ మృతదేహం లభ్యం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 11:37 AM ISTమూసీలో కొట్టుకొచ్చిన మృతదేహం, నాలాలో గల్లంతైన మహిళేనా?
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో వరుసప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. వర్షాలు, వరద సమయంలో బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న నాలాలో పడి బాలుడు చనిపోగా.. అంతకు ముందు కవాడిగడూ డివిజన్ పరిధిలో హుస్సేన్‌సాగర్ కాలువలో మహిళ గల్లంతైంది. అయితే.. మూడ్రోజులు అవుతున్నా లక్ష్మీ (55) మృతదేహం లభ్యం కాలేదు. అయితే.. తాజాగా మూసీలో ఒక మృతదేహం కొట్టుకువచ్చింది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద లభ్యమైన మహిళ మృతదేహం లక్ష్మీదేనా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కవాడిగూడ డివిజన్ పరిధిలోని దామోదర సంజీవయ్య బస్తీలో లక్ష్మీ అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. దాంతో.. కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. హుస్సేన్‌సాగర్ కాలువ పక్కనే మహిళ ఇల్లు ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రహారి గోడ కూలిపోవడంతో ప్రమాదకరంగా మారింది. హుస్సేన్ సాగర్ కాలువ కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. తమ తల్లి హుస్సేన్ సాగర్ కాలువలో పడిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తాము బంధువుల ఇళ్లలో కూడా గాలించినా దొరకలేదని చెప్పారు. దాంతో.. గాంధీనగర్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్ సిబ్బంది నాలాలో మహిళ ఆచూకీ కోసం వెతికారు. కానీ.. ఆమె మృతదేహం ఆచూకీ లభించలేదు.
తాజాగా.. మూసారాంబాగ్ మూసీ బ్రిడ్జి వద్ద ఒక మహిళ మృతదేహం లభ్యం అయ్యింది. దాంతో.. మూడ్రోజుల క్రితం కవాడిగూడ వద్ద నాలాలో గల్లంతైన మహిళగానే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దాంతో.. కుటుంబ సభ్యులను వెంటనే పిలిపించి మృతదేహాన్ని చూపించారు. అయితే.. చనిపోయిన మహిళ లక్ష్మీగానే గుర్తించారు. దాంతో.. కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి ఇంటి గోడ కూలిపోవడంతో ప్రమాదభరితంగా మారింది. హుస్సేన్‌సాగర్ నాలాకు రిటర్నింగ్ వాల్ పూర్తయితే తమ ఇంటికి టాయిలెట్ నిర్మించుకోవాలని అనుకున్నామని ఆమె కూతుళ్లు కన్నీటి పర్యంతరం అయ్యారు.