ఆ రోడ్డు వేసింది ఎవరో తేల్చండి?.. పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ గోడ కూల్చివేత, రోడ్డు నిర్మాణ వ్యవహారంపై...
By - అంజి |
ఆ రోడ్డు వేసింది ఎవరో తేల్చండి?.. పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ గోడ కూల్చివేత, రోడ్డు నిర్మాణ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నిజాంపేటలోని APR ప్రణవ్ యాంటిలియా గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. అధికారులెవరూ రోడ్డు నిర్మించలేదని చెబుతున్నప్పుడు, అక్కడ రోడ్డు ఎలా ప్రత్యక్షమైందని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2024లో ప్రహరీ గోడను పాక్షికంగా కూల్చివేసినప్పుడే తాము కోర్టును ఆశ్రయించి స్టేటస్ కో (యథాతథ స్థితి) ఉత్తర్వులు పొందామని తెలిపారు. అయితే, ఈ ఏడాది మార్చి 5న అధికారులు నోటీసులు ఇచ్చి, మార్చి 9న అక్రమంగా గోడను కూల్చివేసి రోడ్డు వేశారని కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన హెచ్ఎండీఏ తరపు న్యాయవాది.. నిబంధనల ప్రకారం లేఅవుట్ ప్లాన్‌లో ఉన్న రోడ్లను ప్రహరీ గోడలతో అడ్డుకోకూడదని వాదించారు. మరోవైపు, హైడ్రా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. తాము అక్కడ ఎలాంటి రోడ్డు నిర్మాణం చేపట్టలేదని స్పష్టం చేశారు.
రెండు వైపుల వాదనలు విన్న జస్టిస్ ఎన్.పి. శ్రవణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటు హెచ్ఎండీఏ, ఇటు హైడ్రా ఇద్దరూ రోడ్డు వేయలేదని చెబుతుంటే, మరి ఆ రోడ్డును ఎవరు నిర్మించారో తేల్చాలని ఆదేశించారు. బాచుపల్లి, జగద్గిరిగుట్ట, దుండిగల్ పోలీస్ స్టేషన్ల అధికారులు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేశారు.