విషాదం.. ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి పడి అంధ విద్యార్థి మృతి
బేగంపేటలో పాఠశాల ఐదో అంతస్తు నుంచి కింద పడి అంధ విద్యార్థి మృతి చెందాడు.
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 1:46 PM IST
ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి పడి అంధ విద్యార్థి మృతి
బేగంపేటలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ఐదో అంతస్తు నుంచి కింద పడి అంధ విద్యార్థి మృతి చెందాడు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బేగంపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ జయచందర్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖైరతాబాద్‌లోని శ్రీనివాసనగర్‌కు చెందిన వెంకట రవికుమార్ కుమారుడు గౌతం లక్ష్మీ శ్రీకర్(12) బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు నియమించిన కేర్ టేకర్‌తో కలిసి ప్రతి రోజు లాగానే గురువారం కూడా పాఠశాలకు వచ్చాడు.
అతడి క్లాస్ రూమ్ నాలుగో అంతస్తులో ఉంటుంది. గురువారం మధ్యాహ్నాం సమయంలో అతడి కేర్ టేకర్ వాష్ రూమ్‌కి వెళ్లగా క్లాస్ కు వెళ్లేందుకు గౌతమ్ మెట్ల రెయిలింగ్ పట్టుకుని ఐదో అంతస్తుకి వెళ్లాడు. నిర్మాణ పనులు జరుగుతుండడంతో కాంట్రాక్టర్ అక్కడి పిట్ట గోడను కూల్చివేశాడు. పిట్టగోడ లేని ప్రాంతానికి శ్రీకర్ వెళ్లడంతో ప్రమాద వశాత్తు అక్కడి నుంచి కిందపడ్డాడు.
పాఠశాల సిబ్బంది వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.