వైభవంగా ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర
Ujjain Mahakali bonams started minister talasani presented the first bonam. హైదరాబాద్ నగరంలో లష్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా
By అంజి Published on 17 July 2022 10:02 AM ISTహైదరాబాద్ నగరంలో లష్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. ఉదయం 4.05 నిమిషాలకు ఆలయ ద్వారాలు తెరిచారు. ఆలయ పూజారులు తొలుత అమ్మవారికి మహామంగళ హారతి ఇచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ నేతలు, సంఘాల నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి క్రమక్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ, రేపు జాతర జరగనుంది. మహంకాళి ఆలయంతో పాటు, చుట్టు పక్కల ఉన్న ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించే భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
''రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను. రాజకీయాలకు అతీతంగా అందరినీ బోనాల జాతరకు ఆహ్వానించాం. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం'' అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
''ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఏటా మేం ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటాం. అమ్మవారి దర్శనం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.'' అని ఓ భక్తురాలు చెప్పింది.
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా బోనాలు నిర్వహణ సంప్రదాయంగా వస్తోందని, అమ్మవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని అన్నారు.
మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం కేసీఆర్
ఇవాళ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ముంపుపై ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం.. పర్యటన అనంతరం ఏటూరునాగరం నుంచి హైదరాబాద్‌కు వస్తారు. అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు.
నేడు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ బోనాలకు హాజరవుతారు. కుటుంబ సమేతంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.
ఈ వేడుక కోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి ఆలయ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. 3500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. అలాగే ఈ రెండు రోజులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహంకాళి ఆలయానికి టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. 'ఉజ్జయిని మహంకాళి జాతర స్పెషల్' పేరిట ఈ సర్వీసుల్ని నడపనుంది. లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. సికింద్రాబాద్ సమీపంలోని వివిధ ప్రాంతాల్లో సర్వీసులు నడిచేలా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆర్టీసీ 11 మంది ప్రత్యేక అధికారుల్ని నియమించింది.
మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
బోనంతో వచ్చే మహిళలకు, సాధారణ భక్తులకు వేరు వేరు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లను పూర్తిగా సీసీటీవీ కెమెరాల నిఘా నీడలో ఉన్నాయి. మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కెమెరాలను కనెక్ట్ చేశారు. పిక్ పాకెటర్లు, చైన్ స్నాచర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మహిళలను అప్రమత్తం చేసేందుకు పాత నేరస్తుల ఫొటోలతో కూడిన పోస్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల కోసం స్పెషల్ పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి సోమవారం బోనాల జాతర ముగిసేవరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు ఇవే..
రైల్వేస్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెహికల్స్.. చిలకలగూడ క్రాస్ రోడ్స్, గాంధీ హాస్పిటల్స్, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్, కవాడిగూడ, మ్యారియట్ హోటల్ మీదుగా ట్యాంక్బండ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సీటీవో జంక్షన్ నుంచి ఎంజీ రోడ్ వైపు వచ్చే వెహికల్స్.. ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, సింధి కాలనీ, మినిస్టర్ రోడ్స్, రాణిగంజ్ క్రాస్ రోడ్స్, కర్బాల మైదాన్ రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది. బైబిల్ హౌస్ నుంచి రైల్వేస్టేషన్, తిరుమలగిరి వైపు వచ్చే వాహనాలు.. ఘస్మండి క్రాస్ రోడ్స్ మీదుగా సజ్జన్లాల్ స్ట్రీట్, హిల్ స్ట్రీట్ రాణిగంజ్ వైపు దారి మళ్లించనున్నారు. కర్బలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వెళ్లే వెహికల్స్.. రాణిగంజ్ క్రాస్ రోడ్స్, మిని స్టర్ రోడ్స్, రసూల్ పురా క్రాస్ రోడ్స్, పీఎస్ టీ ఫ్లై ఓవర్, హెచ్ పీఎస్ యూటర్న్, సీటీవో, ఎస్ బీఐ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ క్రాస్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, గోపాలపురం లేన్ మీదుగా దారి మళ్లించనున్నారు.