Hyderabad: పాతబస్తీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం
మీర్‌చౌక్ ప్రాంతంలో ఆస్తి విషయమై రెండు గ్రూపులు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే ఓ న్యాయవాది రైఫిల్‌తో కాల్పులు జరిపాడు.
By అంజి Published on 18 Jun 2023 6:13 AM GMTHyderabad: పాతబస్తీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం
హైదరాబాద్: మీర్‌చౌక్ ప్రాంతంలో ఆస్తి విషయమై రెండు గ్రూపులు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే ఓ న్యాయవాది రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. శనివారం అర్థరాత్రి మండి మీర్ ఆలం సమీపంలోని మగర్ కి బౌలి వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు మీర్‌చౌక్ పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిని మసూద్ అలీ ఖాన్ (న్యాయవాది), ముర్తుజా అలీ ఖాన్, హష్మతునిసా బేగం, మహ్మద్ ఖలీఖ్ ఉర్ రెహ్మాన్ ఖురేషీ అకా అర్ఫాత్, మహ్మద్ అనీఖ్ ఉర్ రెహ్మాన్ ఖురేషీ, ఇబ్రహీం అలీ ఖాన్, సుల్తానా, ఇతర కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. గ్రూపులు పరస్పరం కర్రలతో గొడవకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. వాగ్వాదం జరుగుతుండగానే న్యాయవాది మసూద్ అలీ ఖాన్ తన రైఫిల్ నుండి ప్రత్యర్థి వర్గంపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఇరువర్గాలు రాళ్లదాడికి దిగి ఉద్రిక్తతలను తీవ్రతరం చేశాయి. దీంతో బాధిత ప్రాంతంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మీర్‌చౌక్ పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని మీరాలం మండిలోని మగర్‌కీ బౌలిలో కొనసాగుతున్న ఆస్తి తగాదాలే ఈ ఘర్షణకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అర్థరాత్రి సమయంలో, మసూద్ అలీ ఖాన్ బృందం వివాదాస్పద ఆస్తికి తాళం వేయగా, ప్రత్యర్థి వర్గం బలవంతంగా తాళాలు తెరిచింది. ఈ సమయంలోనే మసూద్ అలీఖాన్ తన నివాసం నుండి లైసెన్స్ కలిగిన రైఫిల్‌ని వెలికితీసి గాలిలోకి రెండుసార్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కోఆర్డినేషన్ గజరావు భూపాల్, ఇతర పోలీసు అధికారులతో కలిసి రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై మీర్‌చౌక్ పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఆయుధ చట్టం కింద న్యాయవాది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతోంది.