వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో శనివారం నాడు పడవ బోల్తా పడిన ఘటనలో హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌కు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు. మృతులను రితిక (44), పూర్ణిమ (50) గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వారాంతంలో రిసార్ట్‌లో గడపడానికి సర్పన్‌పల్లికి వచ్చారు. రిసార్ట్ చేరుకోవడానికి, కుటుంబ సభ్యులు పడవను అద్దెకు తీసుకున్నారు. సర్పన్‌పల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ మధ్యలో పడవ బోల్తా పడింది. ఐదుగురు పర్యాటకులు నీటిలో పడిపోయారు.
స్థానికులు ఈ ప్రమాదాన్ని గమనించి వారిని రక్షించడానికి నీటిలోకి దూకారు. ముగ్గురు వ్యక్తులను రక్షించారు కానీ రితిక, పూర్ణిమ మునిగిపోయారు. వారి మృతదేహాలను తరువాత రిజర్వాయర్ నుండి వెలికితీశారు. ప్రాణాలతో బయటపడిన ముగ్గురు స్పృహ కోల్పొవడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. "శిక్షణ లేని పడవ డ్రైవర్ల కారణంగా ఈ ప్రమాదం జరిగింది. పడవలను నడపకూడదని నిర్దిష్ట మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు పడవలను నడపడంలో నిమగ్నమయ్యారు. వారిపై చర్యలు తీసుకుంటాము" అని పోలీసులు తెలిపారు.