టీఎస్ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ప్ర‌త్యేక బ‌స్సులు, ఉచిత ప్ర‌యాణం

TSRTC offers free travel for kids below 12 years on Jan 1.తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కొత్త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Dec 2021 8:13 AM IST
టీఎస్ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ప్ర‌త్యేక బ‌స్సులు, ఉచిత ప్ర‌యాణం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కొత్త సంవ‌త్స‌రం ప్రారంభం దృష్ట్యా ప‌లు ఆప‌ర్ల‌ను తీసుకువ‌చ్చింది. కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు జ‌రుపుకునేందుకు బ‌య‌టికి వెళ్లే వారి కోసం అద‌నంగా బ‌స్ సర్వీసులు న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. వేడుక‌లు ముగించుకుని తిరిగి వారు క్షేమంగా ఇళ్ల‌కు చేరుకునేందుకు శ‌నివారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నుంది. ఈ విష‌యాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.

ఆర్టీసీ సూచించిన 15 ప్రాంతాల‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈవెంట్స్ కు వెళ్లే వారి కోసం ఈ ప్ర‌త్యేక బ‌స్సులు రాత్రి 7.30 గంట‌ల నుంచి 9.30 గంట‌ల‌కు వ‌ర‌కు అప్ జ‌ర్నీ, రాత్రి 12.30 నుంచి తెల్ల‌వారుజామున 3 గంట‌ల వ‌ర‌కు డౌన్ జ‌ర్నీ ట్రిప్పులు న‌డ‌వ‌నున్నాయి. ఈ బ‌స్సుల్లో ప్ర‌యాణించే వారికి రూ.100 చొప్పున చార్జి వ‌సూలు చేయ‌నున్నారు. స్టాప్‌లు, చిన్నారులు, పెద్ద‌లు అన్న తేడా ఉండ‌బోద‌నీ ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా రూ.100తో ఒక వైపు ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఇక 18 సీట‌ర్లు ఉన్న ఏసీ బ‌స్సుల‌ను రూ.4వేల‌కు అద్దెకు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.

జ‌న‌వ‌రి 1న 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఉచిత ప్ర‌యాణం

నూత‌న సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని చిన్నారుల‌కు టీఎస్ఆర్టీసీ బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రి 1 తేదీన 12 ఏళ్లలోపు చిన్నారులు అంతా ఉచితంగా ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించవ‌చ్చున‌ని తెలిపింది. ఈమేర‌కు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 12 ఏళ్ల లోపు చిన్నారుల‌కు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని, రాష్ట్రంలో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా ప్ర‌యాణించ‌వ‌చ్చున‌ని తెలిపారు. ఈ అవ‌కాశాన్ని చిన్నారులు స‌ద్వినియోగం చేసుకునేలా ఆర్టీసీ అధికారులు విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌న్నారు.

Next Story