వినూత్న నిర్ణయాలతో టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులను ఆకర్షిస్తోంది. స్పెషల్ డేల్లో ఫ్రీ జర్నీ, కార్గొ సేవలు, తిరుమల దర్శన టికెట్లు ఇలా సరికొత్త ఆలోచనలతో ఆర్టీసీ లాభాల వైపు అడుగులు వేస్తోంది. ఇటీవలే కొత్తగా ఒకేషనల్ జూనియర్ కాలేజీని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఐటీ ఉద్యోగులకు ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వీరి కోసం భారీగా కొత్త సర్వీసులను ప్రకటించింది. సికింద్రాబాద్-వేవ్ రాక్ మార్గంలో భారీగా బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది.
ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థం ఈ సేవలను తీసుకువచ్చినట్లు ఆర్టీసీ ప్రకటించింది. మైత్రీవనం, హైటెక్ సిటీ, కొత్తగూడ, గచ్చిబౌలి మీదుగా ఈ బస్సులు నడుస్తాయని తెలిపింది. సికింద్రాబాస్ నుంచి మొదటి బస్సు ఉదయం 6.30 గంటలకు బయలుదేరి.. 8 గంటలకు వేవ్ రాక్ చేరుకుంటుంది. లాస్ట్ బస్ రాత్రి 8.25 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి.. 9.55 గంటలకు వేవ్ రాక్ చేరుకుంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సగటున ప్రతి 15 నిమిషాలకు బస్సు ఉండేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఒకేషనల్ కాలేజీని ప్రారంభించిన ఆర్టీసీ
ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ ఒకేషనల్ జూనియర్ కాలేజీని కూడా ప్రారంభించింది. ఈ కాలేజీలో పలు కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. అడ్మిషన్లు తీసుకునేందుకు ఆహ్వానిస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ కాలేజీలో మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ, ఫిజియోథెరపీ-పీ.టీ, మల్టీపర్సస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) కోర్సులు అందుబాటులో ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండేళ్ల కోర్సులకు గానీ 2022-2023 విద్యాసంవత్సరాల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.