తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రయాణీకుల సంఖ్యను పెంచడానికి ఎంతో కృషి చేస్తున్నారు. రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఉమెన్స్ డే, చిల్డ్రన్స్ డేతో పాటు అమ్మ అనురాగాన్ని, ప్రేమను వెలకట్టలేమంటూ ఆ త్యాగమూర్తి సేవలను గుర్తించుకుని మదర్స్ డే ని పురస్కరించుకుని వారికి ప్రత్యేకంగా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. ఈ క్రమంలోనే రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
రాఖీ పౌర్ణమి రోజున మహిళలు వారి సోదరులకి స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని పరిస్థితులు ఉంటే.. టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్సిల్ సర్వీసుల ద్వారా.. అతి తక్కువ ధరలకే రాఖీలను పంపించుకోవచ్చునని తెలిపింది. టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్సిల్ సర్వీసుల ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది. దీని గురించి పూర్తి సమాచారం కోసం 9154298858, 9154298829 నంబర్లలో సంప్రదించాలని టీఎస్ ఆర్టీసీ సూచించింది. ఊర్ల నుంచి హైదరాబాద్ రాలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. మహిళలకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పుడూ తోడు ఉంటుందని, అందుకే వారికి ఉపయోగపడేలా దీన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది.