డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధన.. తెలంగాణ 'సారథి' పోర్టల్‌లో నమోదు తప్పనిసరి!

హైదరాబాద్ నగరవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అనధికార డ్రైవింగ్ స్కూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది.

By -  అంజి
Published on : 17 March 2026 1:27 PM IST

Sarathi Portal, Vahan Portal Telangana, Driving School Registration, Transport Department Hyderabad, Road Safety Training, Fake Driving Schools, License Services Online

డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధన.. తెలంగాణ 'సారథి' పోర్టల్‌లో నమోదు తప్పనిసరి!

హైదరాబాద్ నగరవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అనధికార డ్రైవింగ్ స్కూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఇకపై అన్ని డ్రైవింగ్ స్కూళ్లు తప్పనిసరిగా ప్రభుత్వ 'సారథి' (Sarathi) పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం లెర్నర్స్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ సేవలు ఇప్పటికే ఈ పోర్టల్ ద్వారా జరుగుతుండగా, ఇప్పుడు శిక్షణ ఇచ్చే సంస్థలను కూడా దీనితో అనుసంధానిస్తున్నారు. దీనివల్ల అర్హత కలిగిన, నాణ్యమైన శిక్షణ ఇచ్చే సంస్థలు మాత్రమే మనుగడలో ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

నిబంధనల ప్రకారం డ్రైవింగ్ నేర్పించే ఇన్‌స్ట్రక్టర్లకు ఐటీఐ (ITI) డిప్లొమా వంటి సాంకేతిక అర్హతలతో పాటు తగిన అనుభవం ఉండాలి. నెలకు కనీసం 25 సెషన్ల పాటు ప్రాక్టికల్ డ్రైవింగ్‌తో పాటు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై థియరీ క్లాసులు నిర్వహించాలి. అయితే, చాలా స్కూళ్లు కేవలం వారం పది రోజులు స్టీరింగ్ పట్టుకోవడం నేర్పించి, శిక్షణ పూర్తయిందని సర్టిఫికేట్ ఇస్తున్నాయి. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10,000 నుండి రూ. 15,000 వరకు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. సరైన అవగాహన లేకుండా రోడ్లపైకి వస్తున్న ఇలాంటి డ్రైవర్ల వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

డిజిటల్ విప్లవం - మార్చి 23 నుంచి 'వాహన్':

సారథి పోర్టల్‌తో పాటు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు (Transfers) మరియు ఇతర సేవల కోసం మార్చి 23 నుండి 'వాహన్' (Vahan) పోర్టల్‌ను కూడా రవాణా శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. డ్రైవింగ్ టెస్టులు, వాహన ఫిట్‌నెస్ తనిఖీలు తప్ప మిగిలిన సేవలన్నీ ఆన్‌లైన్ ద్వారానే లభించనున్నాయి. ఈ డిజిటల్ మార్పు వల్ల సేవలు వేగవంతం కావడమే కాకుండా, దళారుల బెడద తగ్గి సామాన్యులకు పారదర్శకమైన సేవలు అందుతాయని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Next Story