హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం చోటు చేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ఎర్రగడ్డలో నివాసం ఉండే ఈయన అక్టోబర్ 22న నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్‌ను యాక్సెప్ట్ చేయగా పోటీలో నిలిచారు. ఫలితాలకు ఒక్కరోజు ముందు మహమ్మద్ అన్వర్ మరణించడంతో ఆయన అనుచరులు విషాదంలో మునిగిపోయారు.
ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారులు లెక్కింపు కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం ప్రక్రియ 10 రౌండ్లలో పూర్తవుతుంది. ఉప ఎన్నికలో 48.49 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. మొత్తం 1,94,631 ఓట్లు పోలయ్యాయి.
99,771 మంది పురుషులు, 94,855 మంది మహిళలు, ఐదుగురు ఇతరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య 101. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు మరియు 25 మంది ఇతరులు ఉన్నారు. మొత్తం 103 మంది గైర్హాజరు ఓటర్లు (85 ఏళ్లు పైబడిన వారు మరియు వికలాంగులు) పోస్టల్ బ్యాలెట్ కోసం తమ ఎంపికను వినియోగించుకున్నారు. వారిలో 101 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను ఉపయోగించుకున్నారు.