హైదరాబాద్‌లో విషాదం.. భార్య చికెన్ వండలేదని భర్త ఆత్మహత్య
మహాశివరాత్రి పర్వదినం వేళ ఒక చిన్న ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మాంసాహారం వండాలనే విషయంలో...
By - అంజి |
హైదరాబాద్‌లో విషాదం.. భార్య చికెన్ వండలేదని భర్త ఆత్మహత్య
మహాశివరాత్రి పర్వదినం వేళ ఒక చిన్న ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మాంసాహారం వండాలనే విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చివరకు ఒక విశ్రాంత రక్షణ శాఖ ఉద్యోగి ఆత్మహత్యకు దారితీసింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ సింగారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్ సింగారానికి చెందిన దాసరాజుల ప్రకాష్ (66) అనే విశ్రాంత రక్షణ ఉద్యోగి ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి ఇంటికి చికెన్ తీసుకువచ్చారు.
ఆ రోజు మహాశివరాత్రి కావడంతో చికెన్ వండమని తన భార్య పద్మను కోరారు. అయితే, పండుగ రోజున మాంసాహారం తినడం సరికాదని, వండటం కుదరదని పద్మ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో దంపతుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. గొడవ అనంతరం మనస్తాపానికి గురైన పద్మ కాసేపు ఇంటి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ప్రకాష్ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు, పొరుగువారి సహాయంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మృతుడి అల్లుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్న కారణంతోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారా లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.