హైదరాబాద్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సూసైడ్‌

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు...

By -  అంజి
Published on : 24 Feb 2026 11:55 AM IST

Amberpet Family Suicide, Hyderabad Financial Distress Suicide, Ramraj Madhavi Shashank, Amberpet Police Investigation, Hotel Businessman Suicide Hyderabad, Mental Health Awareness

హైదరాబాద్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సూసైడ్‌

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులే ఈ విపరీత నిర్ణయానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. అంబర్‌పేట్‌కు చెందిన రామ్‌రాజ్ (55), ఆయన భార్య మాధవి (50) తమ నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. వీరి కుమారుడు శశాంక్ (24) మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఒకే ఇంట్లో ముగ్గురు విగతజీవులుగా పడి ఉండటం చూసి కుటుంబ సభ్యులు, పొరుగువారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుడు రామ్‌రాజ్ స్థానికంగా హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా వ్యాపారంలో నష్టాలు రావడం, పెరిగిపోయిన ఆర్థిక భారంతో మనస్తాపానికి గురై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అంబర్‌పేట్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనాస్థలంలో ఏవైనా సూసైడ్ నోట్లు లభ్యమయ్యాయా అనే కోణంలో సోదాలు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీల వల్ల ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషాద ఘటనతో అంబర్‌పేట్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story