హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ రూట్లలో అంటే...
హైదరాబాద్‌లో శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 16 Jun 2023 11:01 AM ISTహైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ రూట్లలో అంటే..
హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటించనున్నారు. ఆమె నగరానికి రానున్న సందర్భంగా పలు చోట్ల శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండ్రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 16న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.. తిరిగి 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ ప్రకటనలో తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలో ఏఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి అంటే.. సీటీఓ జంక్షన్, పీఎన్‌టీ ఫ్లైఓవర్, జంక్షన్, హెచ్‌పీఎస్ స్కూల్ ఔట్‌గేట్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, వివి స్టాచ్యూ జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఇక సికింద్రాబాద్ నుంచి వయా బేగంపేట మీదుగా అమీర్‌పేట, మెహదీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ రూట్‌లో రాకుండా అప్పర్ ట్యాంక్‌బండ్‌పై నుంచి వెళ్లాలని సూచించారు. అంతేకాకుండా రాజ్‌భవన్ రోడ్, మొనప్ప జంక్షన్, వివి స్టాచ్యూ ఖైరతాబాద్ మార్గాల్లో రెండు వైపులా రోడ్ మార్గాన్ని మూసివేయనున్నట్లు చెప్పారు. పంజాగుట్ట రాజ్‌భవన్ క్వార్టర్స్ రోడ్‌లో వాహనాలకు అనుమతి ఉండదని సూచించారు హైదరాబాద్ పోలీసులు. సీటీవో జంక్షన్, మినిస్టర్ రోడ్‌లో వచ్చే వాహనాదారులను రసూల్‌పురా జంక్షన్ వద్ద కాసేపు నిలిపివేస్తామని తెలిపారు. ఇక పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్ మీదుగా బేగంపేట ఎయిర్‌పోర్టు మీదుగా వచ్చే వామనాలను ప్రకాశ్‌నగర్ టీ జంక్షన్ వద్ద కొంత సమయం నిలుపుదల చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ రూట్లలో ప్రయాణించే వారు ముందుగానే ఈ విషయాలు తెలుసుకుని బయల్దేరని సూచించారు. కుదిరిన వారు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసులు వివరించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ ట్రాఫిక్ ఆంక్షలు రెండ్రోజుల పాటు ఉంటాయని చెప్పారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.