హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా రేపు(గురువారం) పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఊరేగింపు నిర్ణీత మార్గం గుండా వెళ్లినప్పుడు ట్రాఫిక్ నిలిపివేయబడుతుంది లేదా దారి మళ్లించబడుతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఈ ర్యాలీ సికింద్రాబాద్ హనుమాన్ మందిర్ తాడ్‌బండ్ వరకు కొనసాగనుంది. పుత్లిబౌలి క్రాస్ రోడ్స్ – ఆంధ్రాబ్యాంక్ క్రాస్ రోడ్స్, కోటి–సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్ – రాంకోటి క్రాస్ రోడ్స్ – కాచిగూడ -నారాయణగూడ- చిక్కడపల్లి- ఆర్టీసీ క్రాస్ రోడ్స్- వైస్రాయ్ హోటల్, కవాడిగూడ, మహంకాళి టెంపుల్ తదితర ప్రాంతాల మీదుగా తాడ్‌బండ్‌కు చేరుకుంటుంది.
అలాగే.. కర్మాన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి వచ్చే మరో ర్యాలీ చంపాపేట్, ఐఎస్ సదన్, దోబీఘాట్, మలక్‌పేట్, సైదాబాద్ కాలనీ, సరూర్ నగర్, రాజీవ్ గాంధీ స్టాచ్యూ, దిల్‌సుఖ్‌నగర్, మూసారాంబాగ్, నల్లగొండ చౌరస్తా, కోఠి ఉమెన్స్ కాలేజీ చౌరస్తా తదితర మార్గాల నుంచి వచ్చి ప్రధాన ర్యాలీలో కలుస్తుంది. ఈ రెండు రూట్లలో రాకపోకలపై ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు.