ప్రాజెక్ట్ పునరుజ్జీవ: కాకతీయుల కాలం నాటి శిల్పాలకు తిరిగి జీవం పోస్తున్న TORCH
తెలంగాణలోని పురాతన దేవాలయాలు, ప్రదేశాలను సందర్శించే ఎవరైనా కొన్ని శిల్పాలు దెబ్బతిన్నట్లు లేదా వాటి అసలు ఆకృతిని కోల్పోయినట్లు కనిపిస్తాయి.
By అంజి Published on 4 Aug 2024 12:15 PM GMTప్రాజెక్ట్ పునరుజ్జీవ: కాకతీయుల కాలం నాటి శిల్పాలకు తిరిగి జీవం పోస్తున్న TORCH
తెలంగాణలోని పురాతన దేవాలయాలు, ప్రదేశాలను సందర్శించే ఎవరైనా కొన్ని శిల్పాలు దెబ్బతిన్నట్లు లేదా వాటి అసలు ఆకృతిని కోల్పోయినట్లు కనిపిస్తాయి. వాటిని చూసి మనం తెగ బాధపడుతూ ఉంటాం. అయితే అవి నిజంగా ఎలా ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
తెలంగాణ సంస్కృతిని పరిరక్షించే లక్ష్యంతో, చరిత్రకారుడు, వ్యవస్థాపకుడు అరవింద్ పాకిడే నేతృత్వంలోని టార్చ్ (Team of Research on Culture and Heritage) ‘ప్రాజెక్ట్ పునర్జీవ’ పేరుతో ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ప్రాజెక్ట్ పునర్జీవ అంటే ఏమిటి?
పునర్జీవ ప్రాజెక్ట్ కాకతీయ రాజవంశం కాలం నాటి దెబ్బతిన్న శిల్పాలను పునర్నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. కాకతీయ సామ్రాజ్యంలో దాదాపు1,600 ప్రదేశాలలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ వారసత్వ కట్టడాల్లో 4,000కు పైగా శిల్పాలు ఉన్నాయి.
ఈ ప్రాజెక్ట్ లో – అరవింద్, ఈమని శివ నాగి రెడ్డి (రిటైర్డ్ ఆర్కియాలజిస్ట్), ఏలూరి శేషబ్రహ్మం (ప్రముఖ కళాకారుడు), రఘువీర్ (స్తపతి); రక్షిత్ (కళాకారుడు); హిమాన్సీ (నృత్యకారిణి).. దాదాపు 100 పాడైపోయిన శిల్పాలను సేకరించి, స్కెచింగ్ చేసి.. శిల్పాలను తయారు చేయడం ప్రారంభించింది.
‘‘ఆరు నెలల క్రితమే ప్రాజెక్టును ప్రారంభించాం. చాలా ఏళ్లుగా అనేక స్మారక కట్టడాలు దెబ్బతిన్నాయి. అయితే, శిల్పాలు దెబ్బతినకుండా ఉంటే ఎలా ఉంటుందో ఊహించాల్సి ఉంటుంది. ఆ కళాఖండాలను గీసి సిమెంట్‌లో చెక్కాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 30 శిల్పాలను పూర్తి చేశాం’’ అని అరవింద్ న్యూస్‌మీటర్‌తో అన్నారు.
‘‘చారిత్రక దేవాలయాల్లో వందల ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన శిల్పాలను చూసి ప్రజలు బాధపడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాకతీయుల కాలంలో ఒక్కో శిల్పం చెక్కడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టేది. కాకతీయ శిల్పులు తమ జీవితాంతం వేలాది శిల్పాలను రూపొందించారు. దురదృష్టవశాత్తు కాకతీయులపై జరిగిన దాడులలో ఇటువంటి అద్భుతమైన కళాఖండాలు నాశనమయ్యాయి. శిథిలావస్థకు చేరిన శిల్పాల అసలు స్వరూపంపై ఇప్పటి వరకు ఎలాంటి పరిశోధనలు జరగలేదు. వీటిని ఇలా నిర్లక్ష్యం చేస్తే ఉన్నవి కూడా కనుమరుగవుతాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పునర్జీవ నా దగ్గరకు వచ్చింది’’ అని అరవింద్ అన్నారు.
వారసత్వ కట్టడాలను కాపాడడం:
కొన్ని శిల్పాలు వరంగల్ కోట, రామప్ప దేవాలయం, చంద్రవల్లి దేవాలయాలు, నాగులపాడు, కూసుమంచి, ధంతేశ్వరి నుండి సేకరించాము. అరవింద్ ను ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు చేపట్టాలని నిర్ణయించుకున్నారని అడగ్గా.. అరవింద్ మాట్లాడుతూ.. “చరిత్రను గుర్తుపెట్టుకోడానికి శాసనాలు, నాణేలు, పుస్తకాలు, జానపద కథలు వంటి వ్రాతపూర్వక ఆధారాలు ఉంటాయి. శిల్పాల ద్వారా చరిత్రను చూపించవచ్చని నేను నమ్ముతాము. దెబ్బతిన్న శిల్పాలు అప్పట్లో ఎలా ఉండేవో ప్రజలకు చూపించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము." అని తెలిపారు.
''కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయం ఒక్కటే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపికైంది. నల్ల గ్రానైట్ రాయిపై చెక్కిన నాగిని, మద్నిక శిల్పాలు, రంగమండప స్తంభాలు, యాలి, గజకేసరి శిల్పాలు అలనాటి కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచి యునెస్కో గుర్తింపుకు దోహదపడ్డాయి. అయితే, ఈ శిల్పాలు దండయాత్రలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వాటి అసలు రూపాన్ని కోల్పోయాయి. చరిత్రకు మౌనసాక్షులుగా నిలిచాయి. కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు రూపొందించిన వందకు పైగా ప్రసిద్ధ శిల్పాలను గుర్తించి వాటికి మునుపటి రూపాన్ని తీసుకుని రానున్నాం’’ అని అరవింద్ తెలిపారు.
జగదల్పూర్ రాజ్ మహల్ లో ఎగ్జిబిషన్:
అరవింద్ పరిశోధన ప్రకారం, కాకతీయ రాజవంశం వారసులు ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నారు. వారు ఈ 100 శిల్పాలను రాజ్ మహల్‌లో ప్రదర్శించాలని యోచిస్తున్నారు. దీన్ని త్వరలో మ్యూజియంగా మార్చనున్నారు. ఈ శిల్పాలను ప్యాలెస్‌లో శాశ్వతంగా ఉంచే ముందు, హైదరాబాద్, వరంగల్‌లోని కొన్ని ప్రదేశాలలో ప్రజలు చూడడానికి మేము వాటిని ప్రదర్శిస్తాము, ”అని అరవింద్ చెప్పారు.
ఓరుగల్లులో కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. కాకతీయ సామ్రాజ్యం ఏర్పడి 700 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ శిల్పాలను కాకతీయుల పూర్వ రాజధాని వరంగల్‌లో దసరా పండుగ సందర్భంగా ప్రదర్శించనున్నారు. అవి కాకతీయ రాజవంశం (బస్తర్ సామ్రాజ్యం) వారసత్వాన్ని కొనసాగించే రాజ్ మహల్‌లో శాశ్వతంగా ప్రదర్శనకు ఉంచనున్నారు.
TORCH అంటే ఏమిటి?
తెలంగాణ సాంస్కృతిక వైభవం, వారసత్వం, కళలను కాపాడేందుకు ఈ సంస్థను స్థాపించారు. అంతరించిపోయే దశలో ఉన్న చారిత్రక కట్టడాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు. ‘డాక్యుమెంటేషన్-ప్రమోషన్-కన్వర్సేషన్’ అనే నినాదంతో పని చేస్తూ ఉన్నారు.
ఈ బృందం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖతో అనేక ప్రాజెక్టులను పూర్తి చేసింది. శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలు, స్థూపాలు, సమాధులు, తోరణాలు, మెట్ల బావులు, రాక్ ఆర్ట్, స్మారక చిహ్నాల గురించి ఈ బృందం కాలానుగుణంగా సమాచారాన్ని సేకరించి వాటిని డాక్యుమెంట్ చేస్తుంది.
సంస్థ వ్యవస్థాపకుడు అరవింద్, తెలంగాణ రాష్ట్రం అంతటా పర్యటించి వందలాది భవనాలను డాక్యుమెంట్ చేశారు. కాకతీయుల శిల్పాలను చూస్తూ పెరిగిన అరవింద్ యాదాద్రి ఆలయ పునరుద్ధరణలో కూడా పాలుపంచుకున్నారు. కాకతీయుల వంశానికి చెందిన మహారాజా కమల్ చంద్ర భంజ్‌దేవ్ కాకతీయ టార్చ్కు గౌరవాధ్యక్షుడుగా ఉన్నారు.
జాబితాలోని కొన్ని శిల్పాలు
కీర్తి ముఖ: ఉబ్బిన కళ్లతో భయంకరమైన ముఖం లాంటి వ్యక్తి అనేక హిందూ దేవాలయాలలోని గర్భగుడి లోపలి ద్వారాన్ని అలంకరించి ఉంటారు. ఇది కీర్తి ముఖంగా పరిగణిస్తారు.
గణపతి: ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడలోని ప్రసిద్ధ శక్తి పీఠం దంతేశ్వరి అమ్మవారి ఆలయంలో 1324లో ప్రతాపరుద్రుని సోదరుడు అన్నమదేవుడు నిర్మించిన ఆలయంలోని వినాయకుని శిల్పం ఇది. ఈ శిల్పంలో వినాయకుడు పామును యజ్ఞోపవేతంగా ధరించారు.
శివప్రియ నృత్య భంగిమ: రామప్ప ఆలయంలో వందలాది నృత్య శిల్పాలు ఉన్నాయి. పేరిణి, కోలాటం, ఇతర శిల్పాలతో పాటు, ముగ్గురు మానవులు, నాలుగు కాళ్ళతో శివప్రియ నృత్య భంగిమ ఉంది. రంగ మంటపానికి ఆగ్నేయ వైపున ఉన్న స్తంభంపై చెక్కిన ఈ శిల్పంలో ముగ్గురు మహిళలు నాలుగు కాళ్లపై నృత్యం చేస్తున్నారు. మధ్యలో ఉన్న స్త్రీ తన కుడి కాలును ఆమె కుడి వైపున ఉన్న స్త్రీకి ఎడమ కాలుగా కలిగి ఉంటుంది, అయితే ఎడమ వైపున ఉన్న స్త్రీ తన ఎడమ కాలును కుడి కాలుగా కలిగి ఉంటుంది. అది మూడు రూపాలలో దర్శనమిస్తుందని శిల్పి తెలిపారు.
రంగ మంటపం పైకప్పు: ఆలయంలోని రంగ మంటపం పైన ఉన్న కపాలి రాతిపై మధ్యలో నటరాజ మరియు అష్ట దిక్పాలకులతో కూడిన కళాకృతి ఉంది.
చతుర్ముఖ శివలింగం: ప్రస్తుతం వరంగల్ కోటలోని శంభు దేవాలయంలో ఉన్న అరుదైన ముఖలింగం నాలుగు దిక్కులకు నాలుగు ముఖాలు చెక్కి ఉంటుంది. వారిని సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశాన అని అంటారు.
కాకతీయ తోరణం: ఈ అరుదైన చతుర్ముఖ లింగం ఒక్కో ద్వారం నుంచి వివిధ రూపాల్లో దర్శనమిస్తూ కాకతీయ సామ్రాజ్యంలో ప్రత్యేకత సంతరించుకుంది.
ఆలయ స్థంభం: పాలంపేట్ గ్రామంలోని రామప్ప చెరువు కట్టపై ఉన్న త్రికూట ఆలయ స్తంభం ఇది. ఇది కాలక్రమేణా అరిగిపోయింది.